అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడుల్లో 46 మంది మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామన్న తాలిబన్ ప్రభుత్వం
Pakistan Airstrikes on Afghanistan : అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 46కు చేరినట్టుగా తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.
అఫ్గానిస్థాన్‌లోని పక్టికా ప్రావిన్స్‌లో పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో కనీసం 46 మంది మరణించారని అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని డిప్యూటీ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ ధృవీకరించారు. తూర్పు అఫ్గానిస్థాన్‌లోని నాలుగు గ్రామాలు లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదని తాలిబన్ ప్రభుత్వం చెబుతోంది.
'ఈ క్రూరమైన చర్యను అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించినట్లు, దూకుడు చర్యగా అఫ్గానిస్థాన్ పరిగణిస్తుంది. ఈ పిరికి చర్యకు సమాధానం ఇవ్వకుండా అఫ్గానిస్థాన్ వదిలిపెట్టదు.' అని జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖౌరజ్మీ అన్నారు.
2021లో అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి పొరుగు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా లేవు. పాకిస్థాన్ తమ పొరుగు దేశమైన అఫ్గాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపించింది. తాలిబన్లు దీనిని తీవ్రంగా ఖండించారు. ఈ సంవత్సరం మార్చిలో పాకిస్థాన్ తమ భూభాగంపై వైమానిక దాడులు నిర్వహించిందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. తాజాగా మరోసారి కూడా ఈ దాడులు చేసినట్టుగా ప్రకటించింది.
ఈ రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా వివాదం పెరుగుతూనే ఉంది. తమ దేశంలో అనేక ఉగ్రదాడులు అఫ్గాన్ భూభాగం నుంచే ప్లానింగ్ జరిగిందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ఖండిస్తోంది. మార్చి నెలలో పాకిస్థాన్ చేసిన వైమానిక దాడిలో ఐదుగురు మహిళలు, పిల్లలు చనిపోయారని అఫ్గాన్ ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ఎక్కువైంది. అయితే ఆ సమయంలో అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు నిర్వహించినట్టుగా పాకిస్థాన్ అంగీకరించింది. తాజాగా మరోసారి అఫ్గాన్‌లో వైమానిక దాడులు జరగడంతో తాలిబన్ ప్రభుత్వం పాక్ మీద కోపం మరింత పెంచుకుంది.