పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో మే 7న భారత్ జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు, అంత్యక్రియలకు హాజరైన పాకిస్థాన్ ఆర్మీ అధికారుల పేర్లను భారత్ బయటపెట్టింది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఎలా మద్దతిస్తోందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ ఘటనతో మరోసారి రుజువైందని అంతర్జాతీయ సమాజానికి భారత్ నొక్కిచెబుతోంది.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా బహవల్పూర్ మురిడ్కేలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారని మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్థాన్లోని పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యారని వివరించింది.
లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్, బ్రిగేడియర్ మొహమ్మద్ ఫుర్కాన్( అడ్మినిస్ట్రేషన్), ఉస్మాన్ అన్వర్, పాకిస్థాన్ పంజాబ్ శాసనసభ్యుడు మాలిక్ సోహైబ్ అహ్మద్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 26 మంది మృతికి ప్రతీకారంగా భారత్ మే 7 తెల్లవారుజామున 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో వంద మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు.
ఆపరేషన్ సిందూర్ దాడుల్లో మరణించిన పేరు మోసిన ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారి పేర్లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్.. ఆదివారం సాయంత్రం భారత సైన్యం నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ధృవీకరించారు.
ఆపరేషన్ సిందూర్ కింద జాగ్రత్తగా చర్చించిన తరువాత తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను గుర్తించినట్టు, మే 7వ తేదీన జరిగిన 9 ఉగ్రదాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ చెప్పారు. ఈ దాడుల్లో యూసఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ మృతి చెందారని వివరిచారు.
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన యూసుఫ్ అజహర్.. మౌలానా మసూద్ అజహర్ బావమరిది. జైషే మహ్మద్ ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇచ్చే ఆయన జమ్ముకశ్మీర్లో పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడు.
రవూఫ్ లష్కరే తోయిబా కమాండర్, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ గుర్తించిన ఉగ్రవాది. కాగా, పుల్వామా దాడిలో ముదాసిర్తో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా బయటపడ్డాయి.
వీరితో పాటు మే 7న జరిగిన దాడిలో ఖలీద్ (అబూ ఆకాషా) హతమయ్యాడని, అతను శిక్షణ పొందిన లష్కరే తోయిబా ఉగ్రవాది అని, కశ్మీర్లో కార్యకలాపాలు సాగించి, తిరిగి పారిపోయాడని డీజీఎంఓ కొన్ని రోజుల క్రితం తెలిపింది. ఇటీవల మురిడ్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయానికి మకాం మార్చి కేంద్ర కమిటీలో సభ్యుడు అయ్యాడని వివరిచింది.
సంబంధిత కథనం
టాపిక్