ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు సృష్టించిన అరాచకాలకు సంబంధించిన కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే నాటి సంఘటనలకు సంబంధించిన ఒక లైవ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది! ఓ పర్యాటకుడు జిప్లైనింగ్ చేస్తుండగా, ఉగ్రవాదుల కాల్పులకు చుట్టుపక్కన ప్రజలు పరిగెడుతుండటం, కొందరు కుప్పకూలడం ఆ వీడియోలో రికార్డు అయ్యాయి.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి భయానక క్షణాలను గుర్తుచేసుకున్న రిషి భట్ టూరిస్ట్, జిప్లైనింగ్ చేస్తుండగా ఉగ్రవాదుల కాల్పులను చూసి తాను, తన కుటుంబం తృటిలో ఎలా తప్పించుకున్నామో వివరించారు.
రిషి భట్ జిప్లైనింగ్ మొదలు పెట్టగానే ఆపరేటర్ అతడిని విడిపించే ముందు మూడుసార్లు 'అల్లాహు అక్బర్' అని నినదించాడు. భట్ నవ్వుతూ రైడ్‌ను ఆస్వాదించడం వీడియోలో చూడవచ్చు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో తుపాకీ లాంటి శబ్దం వినిపిస్తోంది. పైన రిషి భట్ జిప్లైనింగ్ చేస్తుండగా, కింద మైదానంలో పర్యాటకులు చెల్లాచెదురుగా పరిగెడుతుండటం గమనించవచ్చు. వీడియో చివరిలో ఓ వ్యక్తికి బుల్లెట్ తగలడంతో, అతను కిందపడిపోవడం కూడా వీడియోలో రికార్డు అయ్యింది.
వాస్తవానికి జిప్లైనింగ్ చివరి వరకు రిషి భట్‌కి ఉగ్రదాడి గురించి తెలియదు. రైడ్‌ని ఆశ్వాదిస్తూ ఉండిపోయాడు. కానీ చివరిలో, ఏం జరుగుతోందో గ్రహించిన భట్ కంగారు పడటంతో వీడియో ముగుస్తుంది.
తాను జిప్‌లైన్ తీసుకునేలోపే తన భార్య, కుమారుడు, మరో నలుగురు వ్యక్తులు ఆ ప్రాంతాన్ని దాటేశారని భట్ గుర్తు చేసుకున్నారు.
"వారు అక్కడ ఉన్నప్పుడు ఈ వ్యక్తి 'అల్లాహు అక్బర్' అనలేదు. కానీ నేను జిప్‌లైన్‌లో ఉన్నప్పుడు, అతను మూడుసార్లు చెప్పాడు. ఆపై కాల్పులు ప్రారంభమయ్యాయి," అని రిషి భట్ చెప్పుకొచ్చాడు.
హిందుస్థాన్ టైమ్స్ ఈ వీడియోను స్వతంత్రంగా ధృవీకరించలేదు.
2019 పుల్వామా దాడి తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత భయంకరమైన దాడుల్లో పహల్గామ్ ఘటన ఒకటి. ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ ఈటీ) ప్రాక్సీ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్ ) ఈ దాడికి పాల్పడింది.
పహల్గామ్ ఉగ్రదాడి గురించి రిషి భట్ మాట్లాడుతూ.. “నేను జిప్లైనింగ్ చేస్తున్నప్పుడు కాల్పులు ప్రారంభమయ్యాయి. దాదాపు 20 సెకన్ల పాటు ఈ విషయం నాకు అర్థం కాలేదు. అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయని, నేలపై ఉన్నవారు చనిపోతున్నారని గ్రహించాను. 5-6 మంది కాల్పులు జరపడం చూశాను,” అని చెప్పుకొచ్చాడు.
దాదాపు 20 సెకన్ల తర్వాత అది ఉగ్రవాద దాడి అని అర్థమైందని ఆయన వివరించారు. అతను (జిప్‌లైన్ ఆపరేటర్) మూడుసార్లు 'అల్లాహు అక్బర్' అని చెప్పడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. మా కంటే ముందున్న రెండు కుటుంబాల్లోని పురుషులను వారి మతం అడిగారని, నా భార్య, కుమారుడి ముందే కాల్చి చంపారని తెలుసుకున్నాను. భార్య, కుమారుడు కేకలు వేశారు. బెల్టు విప్పేసి కిందకు దూకి భార్యాబిడ్డలను తీసుకుని పారిపోయాను. గుంతలాంటి ప్రదేశంలో దాక్కున్న వ్యక్తులను మేము చూశాము, కాబట్టి మీరు అక్కడ ఎవరినైనా సులభంగా గుర్తించలేరు. మేము కూడా అక్కడే దాక్కున్నాం," అని నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
8-10 నిమిషాల తర్వాత కాల్పులు ఆగిపోవడంతో ప్రధాన గేటు వైపు పరుగెత్తడం ప్రారంభించామని భట్ తెలిపాడు.
“కానీ మళ్లీ కాల్పులు మొదలై నలుగురైదుగురు కాల్పులు జరిపారు. 15-16 మంది టూరిస్టులను మా ముందే కాల్చి చంపారు. మేము గేటు వద్దకు చేరుకున్నప్పుడు, స్థానిక ప్రజలు అప్పటికే వెళ్లిపోవడం మేము చూశాము. ఒక పోనీ గైడ్ మమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. మేము కొంతసేపటికి మా ముందు భారత ఆర్మీ సిబ్బందిని చూశాము. టూరిస్టులందరికీ కవర్ ఇచ్చారు. 20-25 నిమిషాల్లోనే పహల్గామ్ని సైన్యం కవర్ చేసింది. 18-20 నిమిషాల్లో పర్యాటకులందరికీ కవర్ ఇచ్చారు. ఆర్మీ మాకు రక్షణ కల్పించిన తర్వాత మేము సురక్షితంగా ఉన్నామని భావించాము. భారత సైన్యానికి కృతజ్ఞతలు,” అని రిషి భట్ అన్నాడు.
తన ముందు 9 మంది జిప్లైనింగ్ చేశారని, కానీ ఆపరేటర్ ఏమీ మాట్లాడలేదని పహల్గామ్ ఉగ్రదాడి వైరల్ వీడియోలో ఉన్న రిషి భట్ పేర్కొన్నాడు.
“నేను జారుతున్నప్పుడు, అతను మాట్లాడాడు. తరువాత కాల్పులు ప్రారంభమయ్యాయి. కాబట్టి, ఆ వ్యక్తిపై నాకు అనుమానాలు ఉన్నాయి. మూడుసార్లు 'అల్లాహు అక్బర్' అని చెప్పడంతో కాల్పులు మొదలయ్యాయి. చూడ్డానికి మామూలు కశ్మీరీలా కనిపించాడు. లోతట్టు ప్రాంతాల్లో, అడవిలో కూడా ఆర్మీ ఉనికి కనిపించింది. కానీ ప్రధాన ప్రదేశంలో ఆర్మీ అధికారి లేరు. మెయిన్ గేటు వద్ద జమ్ముకశ్మీర్ పోలీసులతో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు,” అని భట్ అన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్