Saint Tirumankai Alwar: భారత్ కు తిరిగి రానున్న చోరీకి గురైన 500 ఏళ్ల నాటి కోట్ల విలువైన ఆళ్వార్ విగ్రహం
Saint Tirumankai Alwar: తమిళనాడులోని ఓ దేవాలయంలో చోరీకి గురైన 500 ఏళ్ల నాటి తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది.
Saint Tirumankai Alwar: తమిళనాడులోని ఓ దేవాలయంలో చోరీకి గురైన 500 ఏళ్ల నాటి తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహం భారత్ కు తిరిగి రానుంది. తాము గతంలో వేలంలో కొనుగోలు చేసిన ఈ విగ్రహాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది. అష్మోలియన్ మ్యూజియం నుండి 16 వ శతాబ్దానికి చెందిన సెయింట్ తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని గతంలో ఒక వేలంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కొనుగోలు చేసింది. ఆ విగ్రహాన్ని భారత్ అభ్యర్థన మేరకు తిరిగి ఇవ్వాలని 11 మార్చి 2024 న, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దాంతో, 500 ఏళ్ల నాట కోట్ల విలువైన తిరుమంకై ఆళ్వార్ (Saint Tirumankai Alwar) కాంస్య విగ్రహం తిరిగి భారత్ కు తిరిగి రానుంది. ఈ విగ్రహాన్ని బ్రిటిష్ పాలన కాలంలో తమిళనాడులోని ఒక దేవాలయం నుంచి చోరీ చేసి తీసుకువెళ్లారు.
60 సెంటీమీటర్ల ఎత్తైన విగ్రహం
ఈ తిరుమంకై ఆళ్వార్ 60 సెంటీమీటర్ల ఎత్తైన విగ్రహాన్ని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని అష్మోలియన్ మ్యూజియం 1967 లో సోత్ బే వేలం లో డాక్టర్ జె.ఆర్.బెల్మాంట్ (1886-1981) అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. డాక్టర్ జె.ఆర్.బెల్మాంట్ పురాతన విగ్రహాలను సేకరించే హాబీ ఉన్న వ్యక్తి. ఈ పురాతన విగ్రహం పుట్టు పూర్వోత్తరాల గురించి గత ఏడాది నవంబరులో ఒక స్వతంత్ర పరిశోధకుడు తమకు సమాచారం అందించాడని, ఆ తర్వాత భారత హైకమిషన్ ను అప్రమత్తం చేశామని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని అష్మోలియన్ మ్యూజియం తెలిపింది.
భారత్ అభ్యర్థన
తమిళనాడులోని ఓ దేవాలయం నుంచి దొంగిలించబడినట్లు భావిస్తున్న ఈ తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని అష్మోలియన్ మ్యూజియం మేనేజ్మెంట్ ను భారత ప్రభుత్వం అధికారికంగా అభ్యర్థించింది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆర్ట్, ఆర్కియాలజీ కళాఖండాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. 1967లో ఈ తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని మ్యూజియం కొనుగోలు చేసింది.