Vice president polls | ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేసిన 725 మంది ఎంపీలు-over 85 pc mps vote till 2 pm to elect next vice president modi ex pm manmohan singh cast ballot ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Over 85 Pc Mps Vote Till 2 Pm To Elect Next Vice President; Modi, Ex-pm Manmohan Singh Cast Ballot

Vice president polls | ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేసిన 725 మంది ఎంపీలు

Sudarshan Vaddanam HT Telugu
Aug 06, 2022 05:54 PM IST

ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. పార్ల‌మెంటు స‌భ్యులు మాత్ర‌మే ఈ ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు అర్హులు. ఆగ‌స్ట్ 6, శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మైంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగింది.

ఓటు వేయ‌డానికి వీల్ చెయిర్‌లో వ‌చ్చిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌
ఓటు వేయ‌డానికి వీల్ చెయిర్‌లో వ‌చ్చిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ (Amlan Paliwal)

Vice president polls | ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ప్ర‌స్తుతం మొత్తం లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యుల సంఖ్య 780. వారిలో 725 మంది ఎంపీలు ఈ ఎన్నిక‌ల్లో ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు దాదాపు 85% పోలింగ్ జ‌రిగింది. మెజారిటీ ఎంపీలు త‌మ ఓటుహ‌క్కును ఉద‌య‌మే వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 6 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Vice president polls | వీల్ చెయిర్‌లో వ‌చ్చిన మ‌న్మోహ‌న్‌

ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, మాజీ ప్ర‌ధాన మ‌న్మోహ‌న్ సింగ్ త‌దిత‌రులు ఉద‌య‌మే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. మ‌న్మోహ‌న్ సింగ్ వీల్‌చైర్‌లో వ‌చ్చి ఓటేశారు. ఓటు వేయ‌డంలో మ‌న్మోహ‌న్‌కు సీపీఎం ఎంపీ జాన్ బ్రితాస్ స‌హ‌క‌రించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, అమిత్ షా, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, పియూశ్ గోయ‌ల్, బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా త‌దిత‌రులు కూడా ఉద‌య‌మే త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మ‌ధ్నాహ్నం పార్ల‌మెంట్ హౌజ్‌కు వ‌చ్చి ఓటేశారు.

Vice president polls | తృణ‌మూల్ దూరం.. కానీ ఓటేసిన ఇద్ద‌రు ఎంపీలు

ఈ ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీయే త‌ర‌ఫున ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్‌ధ‌న్‌క‌ర్‌, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మొత్తం లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యుల సంఖ్య 780 కాగా, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు సుమారు 670 మంది ఓటేశార‌ని అధికారులు తెలిపారు. ఆ త‌రువాత పోలింగ్ స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి మొత్తం 725 మంది ఎంపీలు ఓటేసిన‌ట్లు వెల్ల‌డించారు. 39 మంది ఎంపీలున్న విప‌క్ష తృణ‌మూల్ కాంగ్రెస్ ఈ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే, ఇద్ద‌రు తృణ‌మూల్ ఎంపీలు.. శిశిర్ అధికారి, దివ్యేందు అధికారి పార్టీ నిర్ణ‌యాన్ని ధిక్క‌రించి, ఈ ఎన్నిక‌ల్లో ఓటు వేశారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో 8 ఖాళీలున్నాయి. అయితే, పార్ల‌మెంట్లో అధికార ఎన్డీయేకు ఉన్న సంపూర్ణ మెజారిటీని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, అధికార ప‌క్షం త‌ర‌ఫు అభ్య‌ర్థి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ విజ‌యం లాంఛ‌న‌మేనని స్ప‌ష్ట‌మ‌వుతుంది.

IPL_Entry_Point