Ammonia gas leak in Chennai: చెన్నైలో అమ్మోనియా గ్యాస్ లీక్; భయాందోళనల్లో ప్రజలు
Ammonia gas leak in Chennai: చెన్నై సమీపంలోని ఎన్నూర్ లో ఉన్న ఎరువుల తయారీ కేంద్రంలో మంగళవారం రాత్రి అమ్మోనియా వాయువు లీక్ అయింది. అమ్మోనియా వాయువు చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలకు వ్యాపించడంతో, ఆ విష వాయువును పీల్చి పలువురు అస్వస్థతకు లోనయ్యారు.
Ammonia gas leak in Chennai: ఉత్తర చెన్నైలోని ఎన్నూర్ లోని కోరమాండల్ ఎరువుల తయారీ యూనిట్ లో మంగళవారం రాత్రి అమ్మోనియా గ్యాస్ లీక్ అయిన ఘటనతో 25 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ప్లాంట్ లో లీకేజీ జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపించింది.

కోరమాండల్ లో..
ఎన్నూర్ లోని ఎరువుల తయారీ కేంద్రం ‘కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ కు చెందిన సబ్ సీ పైపులో అమ్మోనియా గ్యాస్ లీకేజీని (Ammonia gas leak) గుర్తించారు. తయారీ కేంద్రానికి సమీపంలో ఉన్న పెరియ కుప్పం తదితర ప్రాంతాల్లోకి ఈ వాయువు వ్యాపించడంతో, ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆ విష వాయువును పీల్చిన వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు తదితర సమస్యలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న 25 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గ్యాస్ లీకేజీ విషయం తెలిసిన వెంటనే ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లను వదిలి రోడ్లపైకి వచ్చారు.
వెంటనే స్పందన
ఎన్నూర్ లోని సబ్ సీ పైపులో అమ్మోనియా గ్యాస్ లీక్ అయినట్లు గుర్తించామని తమిళనాడు పర్యావరణ, అటవీ శాఖ తెలిపింది. ఈ లీకేజ్ ను గుర్తించగానే, వెంటనే స్పందించి, లీకేజీని నిలువరించారని వెల్లడించింది. లీకేజీ వల్ల భరించలేనంత దుర్వాసన వచ్చిందని కంపెనీ ప్రొడక్షన్ హెడ్ చెప్పారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఫెర్టిలైజర్), సప్లై చైన్ అమీర్ అల్వీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘‘మంగళవారం రాత్రి 11.30 గంటలకు ప్లాంట్ ఆవరణ వెలుపల ఒడ్డున ఉన్న అమ్మోనియా అన్ లోడింగ్ సబ్ సీ పైప్ లైన్లో అమోనియా లీకేజీని గుర్తించాము. మా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను వెంటనే యాక్టివేట్ చేసి, అత్యంత తక్కువ సమయంలో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చాము. ఈ ప్రక్రియలో, కొందరు స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించాం’’ అని ఒక ప్రకటన విడుదల చేశారు.