Bald virus : 'ముట్టుకుంటే జుట్టు ఊడొచ్చేస్తోంది!' ఆ గ్రామాల్లోని 150మందికి ఒకేసారి బట్టతల..
Bald virus in Buldhana : మహారాష్ట్ర బుల్దానాలోని కొన్ని గ్రామాలను అంతుచిక్కని సమస్య వణికిస్తోంది! ఇక్కడ నివాసముంటున్న వారి జుట్లు.. ముట్టుకుంటే రాలిపోతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే చాలా మందికి బట్టతల వచ్చేసింది.
కొవిడ్ని చూసుంటారు, హెచ్ఎంపీవీ గురించి విని ఉంటారు. కానీ ఎప్పుడైనా "బాల్డ్ వైరస్" గురించి విన్నారా? మహారాష్ట్ర బుల్దాన్లోని అనేక గ్రామాల ప్రజలు ఇప్పుడు ఈ విచిత్ర సమస్యతో బాధపడుతున్నారు! గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల ప్రజల జుట్టు ఉన్నపళంగా ఊడిపోతోంది. ముట్టుకుంటే చాలు ఊడి చేతికి వచ్చేస్తోంది. ఫలితంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

అసలే జరిగింది..?
బుల్దాన్ షెగావ్ తాలూకాకి చెందిన కల్వాడ్, బండ్గావ్, హింగ్నాతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా 'జుట్టు రాలిపోతున్న' సమస్య నుంచి బాధపడుతున్నారు. తొలుత 30, 40 మందికి జుట్టు రాలిపోయింది. ప్రజలు భయపడటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ సంఖ్య 150 దాటిపోయింది! అసలేం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, పురుషులు, యువకులు అందరూ ఆ సమస్య బారినపడుతున్నారు.
"కొన్ని రోజుల క్రితం నుంచి నా జుట్టు ఊడిపోతోంది. దాన్ని తీసి బ్యాగులో దాచుకున్నాను," అని ఒక వృద్ధురాలు పేర్కొంది. "నాకు 10 రోజులుగా జుట్టు రాలిపోతోంది. చాలా భయంగా, బాధగా ఉంది," అని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వ్యవహారంపై సంబంధిత గ్రామానికి చెందిన సర్పంచ్ స్పందించారు.
"10 రోజులుగా అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ముట్టుకుంటే చాలు జుట్టు ఊడొచ్చేస్తోంది. ఈ విషయాన్ని జిల్లా ఆరోగ్య అధికారికి వివరించాను," అని రమా పాటిల్ థాకుర్ చెప్పారు.
రంగంలోకి ఆరోగ్య నిపుణులు..
మహారాష్ట్రలో బాల్డ్ వైరస్ కలకలం సృష్టించడంతో ఆరోగ్య అధికారులతో పాటు యంత్రాంగం రంగంలోకి దిగింది. తొలుత.. ఇది నీటి వల్ల కలిగిన సమస్యగా భావిచారు. కానీ ఆయా గ్రామాలను ప్రభావితం చేస్తున్న మిస్టరీ “బాల్డ్ వైరస్”కి ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణమం కాదని జుట్టు, గోరు నమూనాలపై చేసిన టెస్టుల ప్రాథమిక పరిశోధనలు నిర్ధరించాయి.
అయితే ఇవి ప్రాథమిక పరిశోధనలు మాత్రమేనని, మరింత విశ్లేషణ అవసరమని వైద్య నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. కచ్చితమైన రోగ నిర్ధారణకు కీలకమైన మైక్రోబయాలజీ రిపోర్టులు గురువారం నాటికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిపుణుల బృందం రెండు రోజుల్లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సమగ్ర దర్యాప్తు చేయనుంది.
కేంద్ర ఆయుష్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ శనివారం పహుర్జీరా, కల్వాడ్, కథోరా, భోంగావ్, బొండ్గావ్ సహా ప్రభావిత గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జాదవ్ స్పష్టం చేశారు. ప్రాథమిక చికిత్స అందిస్తున్నామని, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య వ్యవస్థను సంప్రదించాలని కోరారు.
జనవరి 11న అందిన నివేదికలో నమూనాల్లో ఆర్సెనిక్, సీసం, కాడ్మియం ఆనవాళ్లు కనిపించలేదు. అయితే పరీక్షించిన 31 నమూనాల్లో 14 నమూనాల్లో నైట్రేట్ స్థాయిలు పెరిగాయి. దీంతో ప్రభావిత గ్రామాల్లోని గ్రామ పంచాయతీలు నైట్రేట్ లెవల్స్ ఎక్కువగా ఉన్న నీటి వనరులను.. తదుపరి నోటీసు వచ్చే వరకు వాడొద్దని సూచించారు.
సంబంధిత కథనం