Kedarnath Cloudburst : 12 వేల మంది యాత్రికులు సేఫ్.. రెండు వారాల్లో కేదార్‌నాథ్ యాత్ర పున:ప్రారంభం
Kedarnath Cloudburst : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో చాలా మంది యాత్రికులు కొండ ప్రాంతాల్లో చిక్కుపోయారు. దీంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మెుదలుపెట్టారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ట్రెక్ మార్గంలో చిక్కుకుపోయిన యాత్రికులను తరలించడానికి ఐదు రోజుల పాటు అధికారులు శ్రమించారు. రెస్క్యూ ఆపరేషన్‌ల తర్వాత 12,000 మంది యాత్రికులను రక్షించారు. కొండ మార్గంలో మరమ్మతులు, పునరుద్ధరణ పనులను 15 రోజుల్లో వేగవంతం చేయాలని గర్వాల్ కమీషనర్ సంబంధిత విభాగాలను ఆదేశించారు.
కేదార్‌నాథ్ ట్రెక్ రూట్‌లో సెర్చ్ ఆపరేషన్ కోసం ఆదివారం భారత సైన్యం రెండు స్నిఫర్ డాగ్‌లను మోహరించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్నిఫర్ డాగ్‌లు కేదార్‌నాథ్ ట్రెక్ మార్గంలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను కనుగొన్నాయి. SDRF కమాండెంట్ మణికాంత్ మిశ్రా ప్రకారం, 'మా డాగ్ స్క్వాడ్‌లు కూడా మాకు సహాయం చేస్తున్నాయి.' అని చెప్పారు.
రెండు వారాల్లో కేదార్‌నాథ్ యాత్రను పునఃప్రారంభించేందుకు కృషి చేస్తామని ఉత్తరాఖండ్‌లోని సీనియర్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ మాట్లాడుతూ, 'కేదార్‌నాథ్ ట్రెక్ మార్గం నుండి ప్రజలను తరలించడానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లు ముగిశాయని అన్నారు. ప్రస్తుతం కేదార్‌నాథ్‌లో కొద్ది మంది వ్యక్తులు, దుకాణదారులు, కొందరు యాత్రికులు మాత్రమే ఉన్నారు. గత ఐదు రోజుల్లో 12000 మందిని రక్షించాం.' అన్నారు.
సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే, ఇతర సీనియర్ అధికారులు విపత్తు ప్రభావిత ప్రాంతాలలో ఆన్-సైట్ తనిఖీ, ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న మార్గాలను పరిశీలిస్తూ, సోన్‌ప్రయాగ్ నుండి గౌరీకుండ్ మధ్య రహదారిని పునర్నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేసి, వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పరిశీలన అనంతరం 15 రోజుల్లోగా ట్రెక్ రూట్‌లో మరమ్మతులు, పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖల నుంచి ఉన్నతాధికారులు సూచనలు కోరారు. దీంతో పాటు సోన్‌ప్రయాగ్-గౌరీకుండ్ మధ్య కొట్టుకుపోయిన ప్యాచ్‌లపై తాత్కాలిక రహదారిని నిర్మించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని పీడబ్ల్యూడీ కార్యదర్శి పంకజ్ పాండే, విపత్తు కార్యదర్శి వినోద్ సుమన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గౌరీకుండ్ సమీపంలోని ఘోడా పడవ్ సమీపంలో సుమారు 15 మీటర్ల ప్రాంతం కొట్టుకుపోయింది. జంగిల్‌చట్టిలో 60 మీటర్ల రహదారి కూడా కొట్టుకుపోయింది. మొత్తం 29 ప్రాంతాల్లో పనిని నిర్వహించాలి. ప్రత్యామ్నాయ మార్గంగా శ్రీ కేదార్‌నాథ్, గరుడ్ చట్టి, లించోలి మార్గాన్ని ఉపయోగించాలని ప్రతిపాదించారు. 10 ఫోల్డింగ్ బ్రిడ్జిల ద్వారా చినూక్ లేదా వివిధ ప్రాంతాలకు నడక మార్గాల ద్వారా కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
గౌరీకుండ్ లించోలి, భీంబాలిలో స్తంభాలు దెబ్బతిన్నాయని, దీంతో పాటు సోన్‌ప్రయాగ్ సమీపంలోని 11కేవీ సబ్‌స్టేషన్‌కు కూడా ముప్పు పొంచి ఉందని విద్యుత్ శాఖ అధికారులు సమాచారం అందించారు. సబ్ స్టేషన్ కోసం కొత్త భూమిని గుర్తించి, భూమి నాణ్యత, ఇతర విషయాలను పరిశీలించి కొత్త సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని గర్వాల్ కమిషనర్ ఆదేశించారు.