Maharashtra Election 2024 : మహారాష్ట్రలో ఈసారి నెవర్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్.. 'మహా'బలం ఎవరికుంది?
Maharashtra Assembly Election 2024 Opinion : ఈసారి మహారాష్ట్ర ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఆరు పార్టీలు రెండు కూటములుగా మారి పోటీ పడుతున్నాయి. వెన్నుపోటు రాజకీయాలతో కొన్ని రోజులుగా మహారాష్ట్ర అందరి దృష్టిని ఆకర్శించింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి నెలకొంది.
మహారాష్ట్రలో 30 ఏళ్లుగా సొంతంగా ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధించలేదు. దీంతో ఇక్కడ కూటమి ప్రభుత్వాలు సాధారణమయ్యాయి. కానీ ఈసారి ఆరు పార్టీలు, రెండు కూటములుగా తలపడుతుండటంతో ఇది నెవర్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్‌గా మారింది. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ అధికార మహాయుతి కూటమిగా, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు ప్రతిపక్ష మహా వికాస్ ఆఘాడి కూటమిగా పోటీ పడుతున్నాయి. ఓటరులో ఆరు రకాల ఆలోచనలకు కారణమైన ఈ పార్టీలు, సదరు నాయకుల బలాబలాలపై పీపుల్స్ పల్స్ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఏక్ నాథ్ షిండే
రెండేళ్ల కింద ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయినప్పుడు, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతిలో కీలుబొమ్మగా ఉంటారని భావించారు. కానీ కొన్ని రోజుల్లోనే ఆయన ఆ ఇమేజిని బ్రేక్ చేయగలిగారు. లోక్ సభ ఎన్నికల్లో 15 స్థానాల్లో పోటీ చేసి 7 స్థానాల్లో గెలవడంతో షిండే శివసేనపై అంచనాలు పెరిగాయి. అందుకే పొత్తులో ఆయన పార్టీకి 80 సీట్లు కేటాయించారు.
షిండేతో 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు కలిసి వచ్చారు. కాబట్టి ఈసారి 40 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే సీఎం కుర్చీ షిండేకేనని బీజేపీ అగ్ర నాయకత్వం మాటిచ్చినట్టు తెలుస్తోంది. శివసేన గుర్తుతో పాటు, బలమైన కార్యకర్తలు షిండేకు సానుకూలం కాగా శివసేనను చీల్చినందుకు ప్రజల్లో ఉన్న ఆగ్రహం, ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి.
దేవేంద్ర ఫడ్నవీస్
మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నీ తానై మహారాష్ట్ర బీజేపీని నడిపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాల్లో పోటీ చేసి 9 ఎంపీలే గెలిచి, మిత్రపక్ష శివసేన కంటే తక్కువ స్ట్రయిక్ రేట్ నమోదు చేయడంతో ఈ ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి. అత్యధికంగా 148 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీని 100కి పైగా స్థానాల్లో గెలిపించడం ఆయన ముందున్న సవాల్. ఈ టార్గెట్ చేరుకోవడానికి తనను తాను ప్రియమైన అన్నగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీకి సంఘ్ పరివార్ సహాయసహకారాలు పొందడంలో విజయం సాధించారు. వీటికి తోడు బలమైన స్థానిక నాయకత్వం, హిందూ ఓటర్లు బీజేపీకి బలంగా ఉన్నాయి.
శివసేన, ఎన్సీపీ పార్టీలను చీల్చడం, గుజరాత్‌కు పరిశ్రమల తరలించారనే ప్రచారం, ఉల్లి, సోయాబిన్ రైతులు మద్దతు ధర కోసం చేస్తున్న ఆందోళనలు, మరాఠాలను ఓబీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చి మాట తప్పడం, లోక్ సభ ఎన్నికల తర్వాత కోల్పోయిన నైతిక మద్దతు వంటి అంశాలు బీజేపీ బలహీనతలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో బీజేపీ నమోదు చేసే స్ట్రయిక్ రేట్‌ను బట్టే ఫడ్నవీస్, షిండేకు ఒక మెట్టు పైన ఉంటారా? లేక కిందే ఉంటారా? అని తేలిపోతుంది.
అజిత్ పవార్
తన మామ శరద్ పవార్ నీడ నుంచి బయటకొచ్చాక అజిత్ పవార్ పోటీ పడుతున్న మొదటి ఎన్నిక ఇదే! ఎన్సీపీని చీల్చిన తర్వాత అజిత్ పవార్ దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో పార్టీ ఆర్థికంగా బలంగా ఉంది. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1500 అందించే ‘లడ్కీ బహీన్ పథకం’ తానే రూపొందించానని అజిత్ క్రెడిట్ తీసుకుంటున్నారు. దీంతో అజిత్ పవార్ మహిళా పథకాలకు అనుకూలంగా ఉంటారనే ప్రచారం పార్టీకి సానుకూలంగా మారింది. గత లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాలు పోటీ చేసి ఒక స్థానంలోనే గెలవడంతో ఆయనపై విశ్వసనీయత తగ్గింది. దీంతో తన పార్టీకి పొత్తులో కేవలం 52 సీట్లే దక్కాయి.
ఒకప్పుడు శరద్ పవార్ కంచుకోట బారమతిలోనే అజిత్ పవార్ 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈసారి అక్కడ శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ పోటీకి దిగడం, అజిత్‌కు ఎమ్మెల్యేగా గెలవడమే అన్నింటికంటే పెద్ద సవాల్‌గా మారింది. బారమతి లోక్ సభ స్థానంలో శరద్ పవార్ కుమార్తే సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌పై భారీ విజయం సాధించడం కూడా అజిత్ పార్టీ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. శరద్ పవార్‌కు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం కూడా ఆయన పార్టీకి ప్రతికూలంగా మారింది.
శరద్ పవార్
మాజీ సీఎం శరద్ పవార్ తన ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన ఎన్నికలు ఇవే. 5 ఏళ్ల క్రితం, సిద్ధాంత వైరుధ్యాలున్నప్పటికీ శివసేనను కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వం ఏర్పడేలా చేసి తన చాణిక్యతను చాటుకున్నారు. అజిత్ పవార్ వెన్నుపోటు తర్వాత 84 ఏళ్ల వయసులో మహావీకాస్ ఆఘడిని ఒంటిచేత్తో నడిపిస్తున్న తీరును ప్రత్యర్థులే మెచ్చుకుంటున్నారు.
శరద్ పవార్ పాపులారిటీ ఇప్పుడు ‘ఆల్ టైం హై’ లో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన 10 స్థానాల్లో 8 గెలుచుకుని అత్యధిక స్ట్రయిక్ రేట్ నమోదు చేయడంతో పార్టీకి పట్టు దొరికింది. పశ్చిమ మహారాష్ట్ర, మరఠ్వాడా ప్రాంతాల్లో శరద్ పవార్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ 70 స్థానాల్లో పవార్ వర్సెస్ పవార్ గా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్సీపీ ఒరిజనల్ గుర్తు లేకపోవడం, అజిత్ పవార్ వర్గంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉండటం శరద్ పవార్ పార్టీకి బలహీనతలు మారాయి.
ఉద్ధవ్ ఠాక్రే
మహావికాస్ ఆఘడి కూటమి గెలిస్తే మరోసారి సీఎం కావడానికి అధిక అవకాశాలు ఉన్న నాయకుడు, ఉద్ధవ్ ఠాక్రే. 2003లో ఉద్ధవ్ శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు, ఆయన పార్టీని నడపలేరని చాలామంది అన్నారు. ఆయనను విమర్శించడమే పనిగా పెట్టుకున్న నారాయణ్ రాణే, రాజ్ థాక్రేను బయటకు పంపించి, పార్టీ మీద ఉద్ధవ్ పట్టు సాధించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ 2019లో కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి సీఎం అయ్యారు. కానీ, షిండే వెన్నుపోటుతో శివసేన చీలిపోయింది.
ఉద్ధవ్ పని అయిపోయిందనుకున్న వేళ లోక్ సభ ఎన్నికలు మళ్లీ ఆయనకు ప్రాణం పోశాయి. ఉద్ధవ్ శివసేన 21 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలు గెలిచింది. ఇది షిండే శివసేన పార్టీ స్ట్రయిక్ రేట్ కి సమానం. పార్టీ చీలికతో ఉద్ధవ్ పై ఉన్న సానుభూతి, ముఖ్యమంత్రిగా కోవిడ్ సమయంలో ఎదుర్కొన్న తీరు ఆయన పార్టీకి బలాలుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో షిండే వర్గంలో బలమైన కార్యకర్తలు ఉండటం, పార్టీ ఒరిజనల్ గుర్తు కోల్పోవడం, కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన కార్యకర్తల మధ్య మనస్పర్థలు బలహీనతలుగా మారాయి.
నానా పటోలే
మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై తీవ్రమైన విమర్శలు చేస్తూ కాంగ్రెస్‌కు జోష్ తీసుకొచ్చారు. మహారాష్ట్రలో ఓబీసీ నాయకుడిగా మార్క్ వేయగలిగారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 13 స్థానాలు గెలవడంలో ఆయన వ్యూహాలు పని చేశాయి. కానీ మిత్రపక్షాలతో ఆయన వ్యవహరించే తీరు పార్టీకి ప్రతికూలంగా మారింది. సీట్ల పంపకాల విషయంలో ఆయన ఉద్ధవ్ ఠాక్రేని ఇబ్బంది పెడుతున్నారని, సీనియర్ నేత బాలాసాహెబ్ థోరట్‌ను సీట్ల పంపకాల చర్చలకు పంపించారు.
ముస్లింలు, దళితులు, గిరిజనులు కాంగ్రెస్ శిబిరానికి తిరిగిరావడం సానుకూలంగా మారింది. బీజేపీ బీసీ ఓట్లను సమీకరించాలని వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో, బీసీ ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ వైపు బీసీ నాయకుడిగా నానా పటోలే పాపులారిటీ ఒక అస్త్రంలా మారింది. లోక్ సభ ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్‌లో పెరిగిన అతివిశ్వాసం, టికెట్ దక్కని వాళ్లు రెబల్స్‌గా మారడం కాంగ్రెస్ బలహీనతలుగా ఉన్నాయి.
రేసులో మరికొన్ని పార్టీలు
ఈ రెండు కూటముల ద్విముఖ పోటీలో మాజీ ఎంపీ సంబాజీరాజే బెనర్జీ ‘పరివర్తన్ మహాశక్తి’ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ‘వంచిత్ బహుజన్ ఆఘాడి’, రాజ్ థాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, అసదుద్దీన్ ఓవైసీ ఐఏఎంఐఎం పార్టీలు రెండు కూటముల ఓట్లకు గండి కొట్టేందుకు పావులు కదుపుతున్నాయి. ఓటర్ ముందు ‘మల్టిపుల్ ఆప్షన్స్’ పెట్టిన మహారాష్ట్ర, ఎవరికి జై కొడుతుందో నవంబర్ 23న వెల్లడికానున్న ఫలితాల్లో తేలనుంది.