హల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను ప్రపంచం ముందు పెట్టేందుకు భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఎంపీల బృందాన్ని కేంద్ర ప్రకటించింది. ఈ అఖిలపక్ష బృందంలో అనేక పార్టీల నుండి 7 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన శశి థరూర్ పేరు కూడా ఉంది.
పాకిస్థాన్‌పై భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ గురించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు ఎంపీలు. ఈ ప్రతినిధి బృందం వివిధ విదేశాలకు వెళ్లి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సమయంలో పాకిస్థాన్ చెప్పే అబద్ధాలు బయటపడతాయి. ప్రభుత్వం కాంగ్రెస్ తరపున శశి థరూర్ పేరును పేర్కొనడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎంపీలతో కూడిన ప్రతినిధులు అమెరికా, బ్రిటన్, అనేక ఇస్లామిక్ దేశాలకు వెళ్తారు. ఈ ప్రతినిధి బృందాలు దేశాధినేతలు, సీనియర్ అధికారులను కలిసి ఆపరేషన్ సిందూర్‌పై భారతదేశ దృక్పథాన్ని ప్రదర్శించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టనున్నాయి.
దీనిలో మొదటి పేరు శశి థరూర్(కాంగ్రెస్) ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళతారు. రవిశంకర్ ప్రసాద్ (భారతీయ జనతా పార్టీ) మధ్యప్రాచ్యానికి వెళతారు. ఆగ్నేయాసియాకు సంజయ్ కుమార్ ఝా (జేడీయూ)ను ఖరారు చేశారు. బైజయంత్ పాండా (బీజేపీ) తూర్పు యూరప్ వెళతారు. కనిమొళి కరుణానిధి (డీఎంకే) రష్యాలో పర్యటించనున్నారు. పశ్చిమాసియాకు వెళ్లడానికి సుప్రియా సూలే (ఎన్‌సీపీ) పేరు ఖరారు చేశారు. శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే (శివసేన) ఆఫ్రికాకు వెళ్లనున్నారు. వీరంతా విదేశాల్లో పర్యటించే భారత బృందాలకు నాయకత్వం వహిస్తారు.
తన పేరు ప్రతినిధి బృందంలో చేర్చిన తర్వాత శశి థరూర్ కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి భారత ప్రభుత్వం ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నప్పుడు, నా సేవలు అవసరమైనప్పుడు, వెనుకబడి ఉండను. జై హింద్!.' అని అన్నారు.
ఈ బృందం మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మెుదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఏ విధంగా మద్దతు ఇస్తుందో.., ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని ప్రపంచానికి ఈ అఖిలపక్ష బృందం చెప్పనుంది.