భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాక్ దుస్సాహసానికి దీటుగా బదులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సాయుధ దళాలను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనలో కొత్త పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించాయి. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, పాకిస్థాన్ కాల్పులు జరిపితే.. మేం కూడా జరుపుతామని సమావేశంలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
కశ్మీర్ విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉందని కూడా ఈ సందర్భంగా భారత్ తెలియజేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) తిరిగి రావడమనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని స్పష్టం చేసింది. ఉగ్రవాదుల అప్పగింతపై వాళ్లు మాట్లాడితే మేం మాట్లాడుతామని, మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం లేదని భారత్ పేర్కొంది. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఛానల్ ద్వారా మాత్రమే భారత్ పాకిస్థాన్‌తో మాట్లాడుతుందని, చర్చించడానికి మరో విధానం లేదని ఆ వర్గాలు తెలిపాయి. సింధూ నదీ జలాల ఒప్పందం.. సీమాంతర ఉగ్రవాదంతో ముడిపడి ఉందని ఓ అధికారి తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం కొనసాగినంత కాలం ఈ ఒప్పందం రద్దవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడుల తర్వాత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అనంతరం భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అయితే నియంత్రణ రేఖ వెంబడి షెల్లింగ్, జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్ వరకు డ్రోన్ కార్యకలాపాలు ద్వారా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
ఆదివారం ఉదయానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. కానీ సాయుధ దళాలు అప్రమత్తంగా ఉంటాయని, ఏవైనా ఉల్లంఘనలను తగిన రీతిలో ఎదుర్కోవాలనే ఆదేశాలను కలిగి ఉన్నట్టుగా చెప్పారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు క్షీణించాయి. 26 మందిని ఉగ్రవాదులు చంపేశారు. తర్వాత భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పీఓకే, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. పాక్ కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా తిప్పికొట్టింది భారత్. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా పాక్ డ్రోన్లను పంపింది.