'కిర్నా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు'.. ఈ కొండ పాకిస్థాన్‌కు అంత ముఖ్యమైనదా?-operation sindoor did india target pakistan nuclear site at kirana hills know full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'కిర్నా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు'.. ఈ కొండ పాకిస్థాన్‌కు అంత ముఖ్యమైనదా?

'కిర్నా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు'.. ఈ కొండ పాకిస్థాన్‌కు అంత ముఖ్యమైనదా?

Anand Sai HT Telugu

భారత్ స్వదేశీ రక్షణ వ్యవస్థ అద్భుతంగా పని చేసిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. పాకిస్థాన్‌కు భారత్ ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా కిర్నా హిల్స్ మీద దాడి గురించి కూడా మాట్లాడారు

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్‌తో ఎయిర్ మార్షల్ ఏకే భారతి (PTI)

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇచ్చేందుకు సైన్యం సోమవారం మీడియా సమావేశం నిర్వహించింది.

ఇదే కాన్ఫరెన్స్‌లో ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతిని పాకిస్థాన్‌లోని కిర్నా హిల్స్‌లో ఉన్న అణు కర్మాగారాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందా అని ప్రశ్నించారు. దీనిపై ఎయిర్ మార్షల్ స్పందిస్తూ.. 'లేదు, మా వైపు నుంచి అలాంటిదేమీ జరగలేదు' అని బదులిచ్చారు.

దీనిపై ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడుతూ.. 'కిర్నా హిల్స్‌లో కొన్ని అణు స్థావరాలు ఉన్నాయని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆ విషయం మాకు తెలియదు... మేము కిర్నా హిల్స్‌పై దాడి చేయలేదు, పాక్‌కు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది.' అని చెప్పారు.

భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లోని సర్గోధాలో కిర్నా హిల్స్ కింద ఉన్న ముషాఫ్ వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిందన్న చర్చ అందులో ఒకటి.

పాకిస్థాన్ తన అణ్వాయుధాలు, మందుగుండు సామగ్రిని ఇక్కడే దాచి ఉంచుతుందని చెబుతుంటారు. ఇది అత్యంత రహస్యమైన సైనిక బంకర్. కొండలో ఉన్న రహస్య సొరంగాలు, అణ్వాయుధాలు ఉంచే ప్రదేశాలు దెబ్బతిని ఉండొచ్చని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఎయిర్ మార్షల్ దీనిని ఖండించారు.

భారత స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థపై ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడారు. స్వదేశీ ఆయుధాల పనితీరు కూడా అద్భుతంగా ఉందన్నారు.

కోహ్లీ నా ఫేవరెట్ : లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్

పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్ డిఫెన్స్ వ్యవస్థను క్రికెట్ మ్యాచ్‌తో పోల్చారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించారు. చాలా మంది లాగే నేను కూడా కోహ్లీకి వీరాభిమానిని అని చెప్పారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.