Sam Altman: ‘‘సంవత్సరాల తరబడి లైంగికంగా వేధించాడు’’- ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్ మన్ పై అతడి సోదరి ఆరోపణలు
Sam Altman: కృత్రిమ మేథ కు సంబంధించిన ప్రముఖ స్టార్టప్ ఓపెన్ఏఐ కు సీఈఓ గా వ్యవహరిస్తున్న సామ్ అల్ట్ మన్ పై అతడి సోదరి సంచలన ఆరోపణలు చేశారు. 1990 ల చివరి నుండి 2000 ల ప్రారంభం వరకు మిస్సోరీలో పెరుగుతున్నప్పుడు తనపై శామ్ ఆల్ట్ మన్ లైంగిక దాడులు చేశాడని ఆమె ఆరోపించారు.
OpenAI CEO Sam Altman: దాదాపు దశాబ్ద కాలం తనను లైంగికంగా వేధించాడని ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్ మన్ పై అతడి సోదరి అమెరికాలోని ఫెడరల్ కోర్టులో కేసు వేసింది. 1990 ల చివరి నుండి 2000 ల ప్రారంభం వరకు మిస్సోరిలో తాము పెరుగుతున్నప్పుడు సామ్ ఆల్ట్ మన్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని 30 ఏళ్ల ఆన్ ఆల్ట్ మన్ ఆరోపించింది. ఈ ఆరోపణలతో సోమవారం దావా వేసినట్లు తెలిపింది.
3 ఏళ్ల వయస్సు నుంచి..
తనకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వేధింపులు ప్రారంభమయ్యాయని, చివరి సంఘటన అతను పెద్దవాడిగా ఉన్నప్పుడు జరిగిందని, కానీ అప్పటికీ తాను ఇంకా మైనర్ నేనని ఆమె ఆరోపించింది. సామ్ ఆల్ట్ మన్ తనను తరచూ దూషించేవాడని కూడా ఆన్ ఆల్ట్ మన్ పేర్కొంది. ఈ ఆరోపణలను ఆమె గతంలో సోషల్ మీడియా వేదికగా కూడా చేసింది.
సామ్ ఆల్ట్ మన్ స్పందన
తన సోదరి తనపై చేసిన ఆరోపణలపై ఓపెన్ఏఐ (openAI) సీఈఓ 39 ఏళ్ల సామ్ ఆల్ట్ మన్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ ఎక్స్ లో తను, తన తల్లి, సోదరుల తరఫున ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. ‘ఈ పరిస్థితి మా కుటుంబం మొత్తాన్ని ఎంతో బాధపెడుతోంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తన సోదరి ఆనీ మానసిక సమస్యతో బాధపడుతోందని వెల్లడించారు. ‘‘ఆనీ మా నుండి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉంది" అని సామ్ ఆల్ట్ మన్ చెప్పాడు. ఆమెకు అన్నిరకాలుగా సహాయపడటానికి మేము చాలా విధాలుగా ప్రయత్నించామని అన్నారు.
ఆర్థికంగా చాలా సాయం చేశాం..
తన కుటుంబం తన సోదరికి ఆర్థికంగా ఎంతో సాయం చేశామని సామ్ ఆల్ట్ మన్ తెలిపారు. "మేము ఆమెకు నెలవారీగా డబ్బులు ఇచ్చాము. ఆమె బిల్లులను చెల్లించాము. ఆమె ఇంటి అద్దెను కవర్ చేసాము. తను ఉపాధి అవకాశాలను పొందడంలో సహాయపడ్డాము. ఆమెకు వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించాము. ఆమెకు ఒక ట్రస్ట్ ద్వారా ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాము. తద్వారా ఆమె నివసించడానికి ఇంటిని కలిగి ఉంటుంది. కానీ ఆ ఇంటిపై ఆమెకు ఎలాంటి హక్కులు ఉండవు. మా దివంగత తండ్రి ఎస్టేట్ ద్వారా, అనీ నెలవారీ ఆర్థిక సహాయాన్ని పొందుతుంది. ఇది ఆమె జీవితాంతం కొనసాగుతుంది" అని ఆ ప్రకటనతో సామ్ ఆల్ట్ మన్ కుటుంబం పేర్కొంది.
31 ఏళ్ల వరకు..
మిస్సోరి రాష్ట్ర చట్టం ప్రకారం, తమకు బాల్యంలో జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి పిటిషనర్లు తమకు 31 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు దావా వేయవచ్చు. తాను తీవ్రమైన మానసిక క్షోభను ఎదుర్కొన్నానని, తన మానసిక ఆరోగ్య చికిత్సకు సంబంధించిన వైద్య బిల్లులను చెల్లించలేకపోతున్నాని ఫెడరల్ కోర్టులో వేసిన దావాలో ఆన్ ఆల్ట్మాన్ వివరించారు.
చాట్ జీపీటీ తో పాపులర్
కృత్రిమ మేధ స్టార్టప్ ఓపెన్ఏఐ కు చెందిన చాట్ జీపీటీ (chatgpt) చాట్ బాట్ భారీ విజయం సాధించింది. దాంతో ఆ స్టార్టప్ ను ప్రారంభించిన సామ్ ఆల్ట్ మన్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పయొనీర్ గా నిలిచింది. సామ్ ఆల్ట్ మన్ వ్యక్తిగత సంపదను 2 బిలియన్ డాలర్లకు పైగా అని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. ఇందులో వీసీ ఫండ్స్, స్టార్టప్ పెట్టుబడులు ఉన్నాయి. ఓపెన్ ఏఐ లో తనకు ఈక్విటీ లేదని ఆయన పలుమార్లు చెప్పారు.