Onion Price : పెరిగిన ఉల్లి, బంగాళాదుంప, టమోటా ధరలు.. మీ నగరంలో ధర ఎంత ఉంది?-onion prices rise to 80 rupees in delhi mumbai rates touch 5 year high in november what is the rate in your city ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Onion Price : పెరిగిన ఉల్లి, బంగాళాదుంప, టమోటా ధరలు.. మీ నగరంలో ధర ఎంత ఉంది?

Onion Price : పెరిగిన ఉల్లి, బంగాళాదుంప, టమోటా ధరలు.. మీ నగరంలో ధర ఎంత ఉంది?

Anand Sai HT Telugu
Nov 11, 2024 05:31 PM IST

Onion Prices : కొన్ని రోజులుగా పలు ప్రధాన నగరాల్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరగడంతో వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోంది. తగ్గినట్టుగానే కనిపించినా.. మళ్లీ ధరలు పెరిగాయి.

పెరిగిన ఉల్లి ధర
పెరిగిన ఉల్లి ధర (PTI)

ఉల్లి, బంగాళదుంప, టమోటా ధరలు పెరుగుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.30-40 పెరిగి రూ.70-80కి చేరింది. వారం క్రితం కిలో రూ.40-60 ఉండేది. కిలో ఉల్లి సగటు ధర రూ.60-70కి పెరిగిందని ఢిల్లీలోని స్థానిక వ్యాపారి ఒకరు తెలిపారు. దీనితో అమ్మకాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. ధరల పెరుగుదల కారణంగా అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ వంటల్లో ఇల్లి ముఖ్యమైన భాగం కావడంతో ప్రజలు ఇప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.

ఢిల్లీ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.80గా ఉంది. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నామని, ఈ పెరుగుదల ఇంట్లో ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసిందని ఒక వినియోగదారుడు చెప్పాడు. 'కిలో ఉల్లిని రూ.70కి కొన్నాను. ఇది ఇంటి వంటగది బడ్జెట్‌ను ప్రభావితం చేసింది. ప్రతిరోజూ వినియోగించే కూరగాయల ధరలనైనా తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.' అని వినియోగదారుడు చెప్పాడు.

అదే సమయంలో ముంబైలో కిలో ధర రూ.72కు చేరుకుంది. తాను 5 కిలోల ఉల్లిని రూ.360లకు కొనుగోలు చేశానని, ఉల్లి ధర రెట్టింపు అయిందని ఖాన్ అనే వ్యక్తి తెలిపాడు. ఉల్లి, వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. అది రెట్టింపు అయింది. ఇది ఇంటి బడ్జెట్ పై కూడా ప్రభావం చూపుతుంది.

బిజినెస్ ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, టమోటా ధరలు గత సంవత్సరం ఇదే సమయంలో కిలోకు రూ .64 తో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. బంగాళాదుంప ధరలు అక్టోబర్ 2023 నుండి 51 శాతం పెరిగాయి. సెప్టెంబరులో కురిసిన వర్షాలతో ఖరీఫ్ పంట దిగుబడి ఆలస్యమైందని, ఈ కారణంగా ధరలు పెరిగాయని చెబుతున్నారు.

ధరల ద్రవ్యోల్బణం అక్టోబర్లో 14 నెలల గరిష్ట స్థాయి 5.81 శాతానికి పెరిగిందని, ప్రధానంగా కూరగాయలు, వంట నూనెల ధరల పెరుగుదల దీనికి కారణమని రాయిటర్స్ పోల్ అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన 6 శాతం కంటే ఇది కాస్త తక్కువ.

ఉల్లి ధరల పెరుగుదల గృహాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. వినియోగదారుల అలవాట్లపై ప్రభావం చూపుతోంది. ఇది హోల్‌సేల్ మార్కెట్లలో అస్థిరతకు దారితీస్తుంది. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో కిలో ఉల్లిపాయల ధరలు నవంబర్‌లో 5 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పించగా.. అమ్మకాలు తగ్గడంతో అమ్మకందారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉల్లి ధరలు పెరుగుతున్నాయి.

Whats_app_banner