CJI Chandrachud: సీజేఐగా చివరి రోజు జస్టిస్ చంద్రచూడ్ మానవీయ తీర్పు; కారుణ్య మరణంపై ఆ తల్లిదండ్రులకు ఊరట
CJI Chandrachud: సీజేఐ గా గత వారాంతంలో జస్టిస్ చంద్రచూడ్ పదవీవిరమణ చేశారు. కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. సీజేఐగా చివరి రోజు జస్టిస్ చంద్రచూడ్ ఒక మానవీయ తీర్పును ప్రకటించారు. తన కుమారుడి కారుణ్య మరణాన్ని అనుమతించాలన్న తల్లిదండ్రుల అభ్యర్థనపై తీర్పునిచ్చారు.
CJI Chandrachud: ఒక ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో 13 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 30 ఏళ్ల హరీష్ రాణా తల్లిదండ్రులకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ జోక్యంతో ఉపశమనం లభించింది. తమ కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న పిటిషన్ పై జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా తన చివరి రోజు కీలక తీర్పు వెలువరించారు.
యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు
హరీష్ రాణా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని, వైద్యులు అదే చెబుతున్నారని, అతడి వైద్య ఖర్చులు భరించలేకపోవడంతో పాటు, అతడి పరిస్థితిని చూడలేకపోతున్నామని, అందువల్ల తమ కుమారుడు హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతించాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన తల్లిదండ్రులు అశోక్ రాణా (62), నిర్మలాదేవి (55) సుప్రీంకోర్టును వేడుకున్నారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ చంద్రచూడ్.. హరీశ్ రాణా వైద్యం, సంరక్షణకు అయ్యే వైద్య ఖర్చులను భరించే మార్గాలను అన్వేషించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాణాకు హోమ్ కేర్ సరిపోకపోతే, మరింత నిర్మాణాత్మక వైద్య సహాయం కోసం నోయిడాలోని జిల్లా ఆసుపత్రికి తరలించాలని చంద్రచూడ్ పేర్కొన్నారు. దాంతో, తమ కారుణ్య మరణ పిటిషన్ ను ఆ తల్లిదండ్రులు వెనక్కు తీసుకున్నారు.
ప్రమాదంలో తలకు బలమైన గాయం
హరీశ్ రాణా మొహాలిలో చదువుకుంటున్న సమయంలో నాలుగో అంతస్తు కిటికీ నుంచి కిందపడి తలకు బలమైన అయింది. దాంతో అతడి శరీరం పూర్తిగా చచ్చుబడి పోయింది. అతడి తల్లిదండ్రులు అశోక్ రాణా (62), నిర్మలాదేవి (55) తమ కుమారుడి కోసం గత 13 సంవత్సరాలుగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నారు. చివరకు, తమ కుమారుడి కారుణ్య మరణాన్ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ కు సంబంధించి గత విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ సమగ్ర సంరక్షణ ప్రణాళికను వివరిస్తూ కేంద్రం ఇచ్చిన స్టేటస్ రిపోర్టును సమీక్షించారు. ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్ నుండి క్రమం తప్పకుండా సందర్శనలు, అలాగే ఆన్-కాల్ వైద్యాధికారులు, నర్సింగ్ మద్దతుతో సహా యూపీ ప్రభుత్వం గృహ సంరక్షణ సేవలను అందిస్తుందని నివేదిక ధృవీకరించింది. అన్ని రకాల మందులు, వైద్య సామగ్రి ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
2018 నాటి తీర్పు
నిర్దిష్ట పరిస్థితుల్లో కారుణ్య మరణాన్ని అనుమతించే విధి విధానాలపై సుప్రీంకోర్టు 2018లో ప్రత్యేక తీర్పును వెలువరించింది. తప్పని సరి, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పాసివ్ యూథనేషియా (passive euthanasia) ను అనుమతించాలని, ఎట్టి పరిస్థితుల్లో యాక్టివ్ యూథనేషియా (active euthanasia) ను అనుమతించకూడదని సుప్రీంకోర్టు (supreme court) ఆ తీర్పులో స్పష్టం చేసింది.