Viral video : అప్పటివరకు అంతా ప్రశాంతం- మరుక్షణమే ముంచుకొచ్చిన మృత్యువు! ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు..
Delhi viral video : దిల్లీ మధు విహార్ ప్రాంతంలో అకస్మాత్తుగా ఒక గోడ కూలి, కింద పడిపోయింది. అదే సమయంలో రోడ్డు మీద వెళుతున్న వ్యక్తిపై ఆ శిథిలాలు పడ్డాయి. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఒళ్లు గుగర్పొడిచే వీడియో వైరల్‌గా మారింది.
దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని రోజుల క్రితం దిల్లీలో సంభవించిన ధూళి తుపానుకు ఒక గోడ కూలిపోయింది. ఆ శిథిలాలు కింద నడుస్తున్న వ్యక్తిపై పడటంతో అతను స్పాట్లో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న అక్కడి పరిస్థితుల్లో, మరుక్షణమే మృత్యువు వెంటాడింది!
అసలేం జరిగిందంటే..
దిల్లీలోని మధు విహార్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియోని పీటీఐ వార్తా సంస్థ షేర్ చేసింది. ఈ వీడియోలో మధు విహార్‌లోని ఒక ఇరుకైన సందులో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది. ఉన్నట్టుండి పై నుంచి ఒక గోడ కూలి, రోడ్డు మీద పడింది. అక్కడే ఉన్న ఆ వ్యక్తిపైనా శిథిలాలు పడటంతో అతను నేల మీద పడిపోయాడు. ఆ తర్వాత కదల్లేదు, లేవలేదు. అలా ఉండిపోయాడు.
చుట్టుపక్కన మరికొందరు గాయపడ్డారు. వారిని కాపాడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. సరిగ్గా ఆ సమయంలోనే, మరోసారి శిథిలాలు కిందపడ్డాయి. ఆ వ్యక్తి సైతం గాయపడ్డాడు.
"రాత్రి 7 గంటల సమయంలో మాకు పీసీఆర్ కాల్ వచ్చింది. మేము సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, 6 అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతోందని, దాని గోడ కూలిపోయిందని మాకు తెలిసింది. ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ధూళి తుఫాను సమయంలో గోడ కూలిపోయింది" అని తూర్పు దిల్లీ ఏడీసీపీ వినీత్ కుమార్ ఏఎన్ఐకి తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
నెటిజన్లను ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియో షాక్‌కి గురిచేసింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అని కామెంట్లు పెడుతున్నారు.
మరో ఘటనలో, దిల్లీలోని కరోల్ బాగ్‌లో శుక్రవారం సాయంత్రం ధూళి తుపాను సమయంలో కొత్తగా నిర్మించిన భవనం బాల్కనీ కూలి 13 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు.
నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం మూడో అంతస్తులోని బాల్కనీ బలమైన గాలులకు కుప్పకూలింది. ఇటీవల నిర్మించిన ఈ కట్టడం రోడ్డుపై కూలిపోయి అటుగా వెళ్తున్న బాలుడి మీద పడింది.
దిల్లీలో బీభత్సం..
ఏప్రిల్ 11న దిల్లీని ధూళి తుపాను ముంచెత్తింది. ఈదురుగాలులు శుక్రవారం దిల్లీని అతలాకుతలం చేశాయి. దీంతో దిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
దేశ రాజధానిలో సాయంత్రం వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు కనిపించింది. వాతావరణ కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. పాలం వద్ద ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ పడిపోయిందని, సఫ్దర్జంగ్ వాతావరణ కేంద్రంలో ధూళి తుఫాను కారణంగా మెర్క్యూరీ 7 డిగ్రీల సెల్సియస్ పడిపోయిందని వాతావరణ కార్యాలయాన్ని ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది.
ఫిరోజ్‌షా రోడ్, అశోకా రోడ్, మండి హౌస్, కన్నాట్ ప్లేస్ సహా పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంపై నగరపాలక సంస్థలకు 20కి పైగా కాల్స్ వచ్చాయి.
ప్రధానంగా చెట్లు, కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
సంబంధిత కథనం