Sachin Pilot vs Ashok Gehlot: ‘‘ద్రోహి అంటే బాధ ఉండదా?’’
Sachin Pilot vs Ashok Gehlot: రాజస్తాన్ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ లీడర్ సచిన్ పైలట్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటదన్నది ఓపెన్ సీక్రెట్. వారి మధ్య సయోధ్యకు పార్టీ హై కమాండ్ ఎన్నో విఫల యత్నాలు చేసింది.
Sachin Pilot vs Ashok Gehlot: రాజస్తాన్ ప్రదేశ్ కాంగ్రెస్ లో రెండు ప్రధాన వర్గాలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ లవి. గహ్లోత్ ను గద్దె దించాలన్నది పైలట్ ప్రధాన లక్ష్యం. పైలట్ ను పార్టీలో లేకుండా చేయడం గహ్లోత్ టార్గెట్.
Sachin Pilot vs Ashok Gehlot: సచిన్ ద్రోహి..
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సీఎం అశోక్ గహ్లోత్ ఒకప్పటి తన డెప్యూటీ సచిన్ పైలట్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పైలట్ ను ద్రోహి అంటూ తూలనాడారు. అంతకుముందు, గహ్లోత్ ను సీఎం పదవికి దూరం చేయడం కోసం పైలట్ పెద్ద ఎత్తున ప్రయత్నించిన విషయం తెలిసిందే. లోలోపల ఉన్న ద్వేషాన్ని అప్పటినుంచి బహిరంగంగానే గహ్లోత్ వ్యక్తపరుస్తున్నారు.
Sachin Pilot vs Ashok Gehlot: సచిన్ పైలట్ రియాక్షన్
తనను గహ్లోత్ ద్రోహి అంటూ దూషించడంపై తాజాగా సచిన్ పైలట్ స్పందించారు. గహ్లోత్ తనను ద్రోహి అనడం తనను బాధించిందని వెల్లడించారు. ద్రోహి అంటే ఎవరైనా బాధ పడ్తారు కదా అని వ్యాఖ్యానించారు. అయితే, ఆ విషయాన్ని అంతటితో వదిలేసానని స్పష్టం చేశారు. ‘అన్నీ పట్టుకుని కూర్చోలేం. ముందుకు వెళ్లాలి కదా’ అన్నారు. ‘అవును నేను రాజకీయ నాయకుడినే. కానీ నేను ఒక మనిషిని కదా. భావోద్వేగాలు ఉంటాయి కదా. ద్రోహి అనడం నన్ను బాధించింది. అయితే, మళ్లీ గతంలోకి వెళ్లాలనుకోవడం లేదు’ అని పైలట్ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ కాంగ్రెస్ శాఖలో విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.
Sachin Pilot vs Ashok Gehlot: భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్తాన్ లో కొనసాగుతోంది. ఈ యాత్రను విజయవంతం చేస్తామని ఈ మధ్య ఒకే వేదికపై నుంచి పైలట్, గహ్లోత్ లు స్పష్టం చేశారు. అంతకుముందు, ఇద్దరు నేతలు రాహుల్ ను ప్రత్యేకంగా కలిశారు. పార్టీ రాష్ట్ర శాఖలో విబేధాల వల్ల భారత్ జోడో యాత్ర విఫలం కాకూడదని రాహుల్ ఆ నేతలకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో విబేధాలపై బీజేపీ విమర్శలు చేయడంపై స్పందిస్తూ.. ‘‘రాజస్తాన్ బీజేపీలో ఇప్పుడు కనీసం 10 మంది తామే కాబోయే సీఎంలమని అనుకుంటున్నారు’’ అని పైలట్ ఎద్దేవా చేశారు.