Omar Abdullah divorce petition: తన భార్య పాయల్ అబ్దుల్లా నుంచి విడాకులు కోరుతూ జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసుకున్న అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఒమర్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
ఒమర్ అబ్దుల్లా వాదనలో లొసుగులు ఉన్నాయని, తన భార్య పాయల్ (Payal Abdullah) క్రూరత్వంపై ఆయన చేసిన ఆరోపణలు ఆధారరహితంగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని స్పష్టం చేసింది. అందువల్ల ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) చేసుకున్న అప్పీల్ ను కొట్టివేస్తున్నామని ఢిల్లీ హైకోర్టులోని జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ వికాస్ మహాజన్ ల ధర్మాసనం వెల్లడించింది. తన భార్య తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని, తన విడాకుల అభ్యర్థనపై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా ఆ పిటిషన్ పెట్టుకున్నారు.
ఒమర్ అబ్దుల్లా విడాకుల అభ్యర్థనను 2016 లో ట్రయల్ కోర్టు కొట్టివేసింది. పాయల్ అబ్దుల్లా పై "క్రూరత్వం" లేదా "వదిలి వెళ్లి పోవటం" అనే ఆరోపణలను ఒమర్ అబ్దుల్లా రుజువు చేయలేకపోయారని ట్రయల్ కోర్టు పేర్కొంది. పాయల్‌కు మధ్యంతర భరణంగా ప్రతి నెల రూ. 1.5 లక్షలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఒమర్ అబ్దుల్లాను ఇప్పటికే ఆదేశించింది. అలాగే, అదనంగా, తన ఇద్దరు కుమారుల చదువుల కోసం ప్రతి నెలా రూ. 60,000 చొప్పున చెల్లించాలని ఆదేశించింది. పిల్లలు మేజర్ అయినంత మాత్రాన వారిని పోషించడం, వారికి సరైన విద్యను అందించడం వంటి బాధ్యతల నుండి తండ్రి తప్పించుకోరాదని, తల్లి మాత్రమే పిల్లల పోషణకు అయ్యే ఖర్చుల భారాన్ని భరించకూడదని ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తన ఆదేశాల్లో పేర్కొంది.