స్పీకర్ పదవి ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడింది. అధికార, విపక్ష పార్టీల నడుమ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పీకర్ పదవికి పోటీ ఏర్పడింది. దీంతో ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఎన్డీఏ పక్షాలు ఓం బిర్లా ఎంపికకు మద్దతు తెలిపాయి. దీంతో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్‌ను ఎంపిక చేశారు. దీంతో ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు.
దీంతో తాజాగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. మూజువాణీ ఓటుతో ఎన్నికలు చేపట్టగా.. ఓం బిర్లా విజయం సాధించారు. ఆయన స్పీకర్‌గా ఎన్నికైనట్టుగా ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాను స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకొచ్చారు. తర్వాత స్పీకర్ కుర్చీపై ఓం బిర్లా ఆసీనులయ్యారు. దీంతో రెండు రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు తెరపడినట్టైంది. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల సందర్భంగా అరుదైన సంఘటన కనిపించింది. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఓం బిర్లా వద్దకు వెళ్లి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కరచాలనం చేశారు. ఆ తర్వాత స్పీకర్ కుర్చీ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
రాబోయే ఐదేళ్లలో అందరికీ స్పీకర్ సర్ మార్గనిర్దేశనం చేస్తారని మేమంతా నమ్ముతున్నామని ప్రధాని మోదీ అన్నారు. రెండోసారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. చాకచక్యంగా వ్యవహరించే వ్యక్తి విజయవంతమైన వ్యక్తితో సమానమని మోదీ వ్యాఖ్యానించారు. మీరు విజయం సాధించారని కొనియాడారు.
స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. రాజస్థాన్‌లోని కోటా నుంచి ఎంపీగా గెలిచారు. 2019 నుంచి స్పీకర్‌గా కొనసాగుతున్నారు. వరసుగా పదేళ్లు లోక్‌సభ స్పీకర్‌గా ఉండనున్నారు.