ఓలాకు చెందిన ఏఐ విభాగం కృత్రిమ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆత్మహత్యతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘పని ఒత్తిడి’ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు చేసే పని ఒకరే చేస్తుండటంతో, ఒత్తిడి తట్టుకోలేక సదరు ఉద్యోగి మరణించాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ఓలా.. ఆ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సెలవులో ఉన్నట్టు వెల్లడించింది.
విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఓ సహోద్యోగి రెడ్డిట్ పోస్టులో ఆరోపించారు. ఓలా ఏఐ విభాగం కృత్రిమ్‌లో పనిచేస్తున్న ఫ్రెషర్ ఉద్యోగికి ముగ్గురు వ్యక్తుల పనిభారాన్ని అప్పగించారని, దానిని తట్టుకోలేక అతను ప్రాణాలు తీసుకున్నాడని పోస్ట్‌లో పేర్కొన్నారు.
"ఇది ఇంకా పబ్లిక్ ఎందుకు కాలేదో తెలియదు, నా సహోద్యోగి తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా తన జీవితాన్ని విడిచిపెట్టాడు. అతను కృత్రిమ్‌లో పనిచేసేవాడు. మరో ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఒక ప్రాజెక్టుకు నాయకత్వం వహించేవాడు (ఫ్రెషరీ అయిన తర్వాత కూడా). మిగిలిన ఇద్దరు వ్యక్తులు కంపెనీని విడిచిపెట్టారు. కాబట్టి అతను ఆ ఇద్దరి పనితో కూడా చిక్కుకుపోయాడు," అని రెడ్డిట్ యూజర్ రాశారు.
విషపూరితమైన పని వాతావరణానికి కృతిమ్లోని ఒక మేనేజర్ కారణమని రెడ్డిట్ యూజర్ పేర్కొన్నాడు.
"అతనికి (మేనేజర్) మేనేజ్ చేయడం గురించి నిజమైన తెలియదు. అతను కేవలం కాల్స్‌కు హాజరవుతాడు, అందరిని తిడతాడు. అతను యూఎస్‌లో నివసిస్తున్నాడు. ఎక్కువ మంది ఉద్యోగులు బెంగళూరులో ఉన్నారు," అని ఓలా ఉద్యోగి తన రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మేనేజర్ తన అసహనాన్ని జూనియర్లపై వ్యక్తం చేస్తున్నప్పుడు సమావేశాల్లో అసభ్య పదజాలాన్ని సైతం ఉపయోగిస్తాడని ఆయన అన్నారు.
"సమావేశాల్లో, ముఖ్యంగా ఫ్రెషర్లకు వ్యతిరేకంగా ఉపయోగించిన పదాలు బాధాకరంగా ఉన్నాయి," అని రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు.
కాగా రెడిట్ పోస్ట్ రెండు రోజుల క్రితం బయటకు వచ్చినప్పటి నుంచి అమెరికాలో ఉన్న మేనేజర్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని తొలగించారు.
తమ కంపెనీలో ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు HT.com ఇచ్చిన ఒక ప్రకటనలో ఓలా ఒప్పుకుంది. ఇది జరిగిన సమయంలో ఉద్యోగి వ్యక్తిగత సెలవులో ఉన్నాడని తెలిపింది.
"మా అత్యంత ప్రతిభావంతులైన యువ ఉద్యోగుల్లో ఒకరైన అనిల్ (పేరు మార్చడం జరిగింది) మే 8న కన్నుమూయడం మాకు చాలా బాధ కలిగించింది. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబం, స్నేహితులు, ప్రియమైనవారికి మా హృదయపూర్వక సానుభూతి," అని ఓలా కృత్రిమ్ ప్రతినిధి HT.com చెప్పారు.
“ఘటన జరిగిన సమయంలో అనిల్ వ్యక్తిగత సెలవులో ఉన్నారు. ఏప్రిల్ 8వ తేదీన తన మేనేజర్‌ను సంప్రదించి తనకు విశ్రాంతి అవసరమని చెప్పడంతో వెంటనే వ్యక్తిగత సెలవు మంజూరు చేశారు. తరువాత, ఏప్రిల్ 17న, అతను ఆరోగ్యంగా ఉన్నానని, అయితే అదనపు విశ్రాంతి నుంచి ప్రయోజనం పొందుతానని చెప్పాడు. తదనుగుణంగా అతని సెలవు పొడిగించడం జరిగింది,” అని ప్రతినిధి వెల్లడించారు.
"ఈ విషాద సమయంలో అనిల్ కుటుంబానికి, ఉద్యోగులకు మా పూర్తి మద్దతు ఇస్తున్నాం. మేము సంబంధిత అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. అవసరమైన విధంగా మా సహాయాన్ని అందిస్తూనే ఉంటాము," అని ప్రతినిధి తెలిపారు.
ఓలాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినప్పటికీ రెడ్డి్ట్ యూజర్ మాత్రం ఉద్యోగుల పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొన్నారు.
ఈ షాకింగ్ ఘటన తర్వాత కూడా అక్కడి మేనేజ్మెంట్ ప్రవర్తనలో మార్పు రాలేదు. “ఇకపై ఇక్కడే ఉంటే మేము కూడా అలాగే చేస్తామని ఇతర జట్టు సభ్యులు చెప్పడం విన్నాను,” అని పోస్ట్ చేశాడు.
ఈ ఘటన తర్వాత తన టీమ్ మొత్తాన్ని తొలగించాలని మేనేజర్ హెచ్ఆర్కు ఈమెయిల్ చేశాడని ఆ ఓలా ఉద్యోగి చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం