Odisha train accident: ‘రైల్వే శాఖ నా బిడ్డ వంటిది.. టెక్నాలజీ వాడితే ఈ ప్రమాదం జరిగేది కాదు’: మమత బెనర్జీ-odisha train accident west bengal cm mamata banerjee flags lack of anti collision device ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Odisha Train Accident: ‘రైల్వే శాఖ నా బిడ్డ వంటిది.. టెక్నాలజీ వాడితే ఈ ప్రమాదం జరిగేది కాదు’: మమత బెనర్జీ

Odisha train accident: ‘రైల్వే శాఖ నా బిడ్డ వంటిది.. టెక్నాలజీ వాడితే ఈ ప్రమాదం జరిగేది కాదు’: మమత బెనర్జీ

HT Telugu Desk HT Telugu
Jun 03, 2023 04:10 PM IST

ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సందర్శించారు. ప్రమాద స్థలిని పరిశీలించారు. ఒకే ట్రాక్ పై ఉండే రైళ్లు ఢీ కొనకుండా నిరోధించే కవచ్ టెక్నాలజీని ఈ రైళ్లో ఉపయోగించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు.

పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ
పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ (AFP)

ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ (Coromandel express train tragedy) రైలు ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సందర్శించారు. ప్రమాద స్థలిని పరిశీలించారు. ఒకే ట్రాక్ పై ఉండే రైళ్లు ఢీ కొనకుండా నిరోధించే కవచ్ టెక్నాలజీని ఈ రైళ్లో ఉపయోగించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. అక్కడ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ముందే ఆమె మీడియాతో మాట్లాడారు.

రైల్వే శాఖ నా బిడ్డ వంటిది..

తాను గతంలో రైల్వే శాఖ మంత్రిగా పని చేశానని, రైల్వే శాఖ తనకు బిడ్డ వంటిదని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. రైల్వే ఉద్యోగులు తన సొంత కుటుంబంతో సమానమన్నారు. గతంలో రైల్వే శాఖ మంత్రిగా పని చేసినందువల్ల ఈ శాఖపై అవగాహన ఉందని, ప్రస్తుత రైల్వే మంత్రి కోరితే.. ఈ విషయమై సలహాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మమత వ్యాఖ్యానించారు. ప్రమాదం జరిగిన చోట సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ముందే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రయాణికుల భద్రత, రైలు ప్రమాదాల నివారణలకు సంబంధించి తాను ఎన్నో చర్యలు చేపట్టానని ఆమె వివరించారు. ఈ విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరి కాదని ఆమె పేర్కొన్నారు. అయితే, కోరమాండల్ ట్రైన్ లో రైళ్లు ఢీ కొనడాన్ని నిరోధించే సాంకేతికతను అమర్చలేదని, ఒకవేళ ఆ సాంకేతికత ఇందులో ఉండి ఉంటే, ఈ ప్రమాదం జరిగేది కాదని, ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని ఆమె వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలోనే ఇది అతి పెద్ద రైల్వే ప్రమాదమన్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపే బాధ్యతను రైల్వే సేఫ్టీ కమిషన్ కు అప్పగించాలని ఆమె సూచించారు.

పరిహారం

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబాలకు అదనంగా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని మమత బెనర్జీ ప్రకటించారు. సహాయ చర్యల్లో తమ రాష్ట్ర సిబ్బంది కూడా పాల్గొంటున్నారన్నారు. 1999లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మమత బెనర్జీ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ తరువాత యూపీఏ 1 ప్రభుత్వంలో 2009 నుంచి 2013 వరకు కూడా ఆమె రైల్వే శాఖ బాధ్యతలను నిర్వర్తించారు.

WhatsApp channel