ప్రశాంతతకు మారుపేరైన ఒడిశాలోని కటక్ మతపరమైన ఘర్షణలతో ఆదివారం ఉలిక్కిపడింది! రెండు రోజుల క్రితం దుర్గా మాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణల తర్వాత తాజా హింసాత్మక సంఘటనలు ఆదివారం కూడా కొనసాగాయి. దీనితో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘర్షణలకు దర్గా బజార్ ప్రాంతంలో నిమజ్జన ఊరేగింపు సమయంలో పెద్ద శబ్దంతో సంగీతం ప్లే చేయడంపై తలెత్తిన విభేదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ వివాదం క్రమంగా పెరిగి ఘర్షణలకు దారి తీసింది. చివరికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, బంద్‌కు పిలుపునివ్వడం, రాజకీయ వర్గాల నుంచి శాంతి సందేశాలు వెలువడే వరకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో, దర్గా బజార్ ప్రాంతంతో పాటు పలుచోట్ల నగర పాలక యంత్రాంగం 36 గంటల కర్ఫ్యూ విధించింది.
కటక్ హింసపై పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య తొలిసారిగా హింస చెలరేగింది. దర్గా బజార్ ప్రాంతం గుండా కఠాజోడి నది ఒడ్డుకు వెళుతున్న దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వాగ్వాదం త్వరగానే తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో, పైకప్పుల నుంచి రాళ్లు, గాజు సీసాలు పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ గందరగోళంలో కటక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖిలారి హృషీకేశ్ ద్ఙాన్‌దేవ్ సహా పలువురు గాయపడ్డారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, జనాలను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. కటక్ హింస నేపథ్యంలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. సంఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తించడానికి అధికారులు సీసీటీవీ, డ్రోన్, మొబైల్ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
"అరెస్టు అయిన వారు రాళ్లు రువ్వడంలో పాలుపంచుకున్నారు. వారిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించాం. మరిన్ని అరెస్టులు జరుగుతాయి," అని పోలీసు కమిషనర్ ఎస్ దేవ్ దత్ సింగ్ తెలిపారు.
ఈ గొడవల్లో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవగా, అతన్ని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. డీసీపీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నగరంలో పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నప్పటికీ, జిల్లా యంత్రాంగం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆదివారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి.
నగరం తూర్పు శివార్లలోని బిద్యాధర్‌పూర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, గతంలో ఘర్షణలు జరిగిన కేంద్రమైన దర్గా బజార్ మీదుగా వెళ్లి, సీడీఏ ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ముగిసింది.
ర్యాలీ మార్గంలో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని, గౌరీశంకర్ పార్క్ ప్రాంతంలో పలు దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించిన గుంపులను చెదరగొట్టడానికి కమిషనరేట్ పోలీసులు స్వల్పంగా బలప్రయోగం చేశారు.
కటక్‌లో హింస, ఉద్రిక్తతలు పెరగడంతో, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కటక్ మున్సిపల్ కార్పొరేషన్, కటక్ డెవలప్‌మెంట్ అథారిటీ, అలాగే 42 మౌజా పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పనిచేయకుండా నిలిచిపోతాయి.
దర్గా బజార్, గౌరీశంకర్ పార్క్, బిద్యాధర్‌పూర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను గణనీయంగా పెంచారు. స్థానిక పోలీసులకు సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిని కూడా మోహరించారు.
హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి కటక్ ఘర్షణలపై విచారం వ్యక్తం చేశారు. కటక్ నగరపు శతాబ్దాల నాటి సౌభ్రాతృత్వ సంస్కృతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"కటక్ వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం. ఇది తన ఐక్యతకు, మత సామరస్యానికి ప్రసిద్ధి. కొందరు దుండగుల చర్యల కారణంగా ఇటీవల శాంతికి భంగం కలిగింది," అని మాఝి ఒక ప్రకటనలో తెలిపారు.
పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. "అల్లర్లు సృష్టించే వారిపై ప్రభుత్వం కఠిన నిఘా ఉంచుతుంది. ఎవరినీ ఉపేక్షించరు. కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం," అని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణల్లో గాయపడిన వారికి ఉచిత వైద్య సదుపాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కటక్ ఘర్షణలపై స్పందించారు. సంయమనం పాటించాలని కోరారు. "ఒడిశా ఎల్లప్పుడూ శాంతియుత రాష్ట్రం," అని చెబుతూ, ఈ హింస "తీవ్ర ఆందోళనకరం" అని అభివర్ణించారు.
"సోదరభావానికి నిలయమైన కటక్‌లో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి కలవరపెడుతోంది," అని ఆయన అన్నారు.
కొత్త ప్రభుత్వం కింద పరిపాలనలో లోపాలు ఉన్నాయని పట్నాయక్ ఆరోపించారు. "పరిస్థితిని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా నిస్సహాయంగా కనిపించారు. బీజేపీ ప్రభుత్వం కింద పోలీసులపై ఒత్తిడి కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయి," అని ఆయన వ్యాఖ్యానించారు.
నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చూడటంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ వీహెచ్‌పీ సోమవారం కటక్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.
"పదేపదే అభ్యర్థించినప్పటికీ శాంతిని కాపాడటంలో అధికారులు విఫలమయ్యారు," అని వీహెచ్‌పీ ప్రతినిధి ఒకరు చెబుతూ, డీసీపీ, జిల్లా కలెక్టర్‌లను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు "అసాంఘిక శక్తులు" ప్రయత్నిస్తున్నాయని బిజూ జనతా దళ్ ఆరోపించింది.
కటక్ ఘర్షణల నేపథ్యంలో శాంతిభద్రతలను సమీక్షించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైబీ ఖురాణియా అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి మాఝికి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతోందని హోం శాఖ సీనియర్ అధికారులు ధృవీకరించారు.
మరోవైపు.. శనివారం జరిగిన హింస కారణంగా దాదాపు మూడు గంటల పాటు నిలిచిపోయిన నిమజ్జన కార్యక్రమాలు, పటిష్టమైన పోలీసు భద్రత మధ్య ఆదివారం ఉదయం 9:30 గంటలకు పూర్తయ్యాయి. పోలీసుల సమాచారం ప్రకారం, మొత్తం 120 విగ్రహాల నిమజ్జనం ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగింది.
సంబంధిత కథనం