డబ్బు కోసం ఇంత దారుణమా! మహిళను చంపేసిన బాలిక- అనాథ అని చేర దీస్తే ఇలా..-odisha crime news girl and 2 friends arrested for killing woman who raised her ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  డబ్బు కోసం ఇంత దారుణమా! మహిళను చంపేసిన బాలిక- అనాథ అని చేర దీస్తే ఇలా..

డబ్బు కోసం ఇంత దారుణమా! మహిళను చంపేసిన బాలిక- అనాథ అని చేర దీస్తే ఇలా..

Sharath Chitturi HT Telugu

అనాథ పసికందును చేరదీసి, చదువు చెప్పి, పెంచుకోవడమే ఆ మహిళ చేసిన తప్పు అయ్యింది! ఆ పసికందు పెద్ద అయ్యి, ఆ మహిళనే చంపేసింది. డబ్బు కోసం ఇదంతా చేసింది. ఒడిశాలో జరిగింది ఈ ఘటన.

మహిళను డబ్బు కోసం చంపి..

ఒడిశాలో అత్యంత దారుణ, అమానవీయ ఘటన చోటుచేసుకుంది! కొన్నేళ్ల క్రితం అనాథగా కనిపించిన పసికందును ఆదరించి పెంచుకుంటున్న ఓ మహిళను, ఆ శిశువు పెద్ద అయ్యి మరో ఇద్దరితో కలిసి చంపేసింది! మహిళ ఆస్తిని దక్కించుకునేందుకు ఈ నేరానికి పాల్పడటం గమనార్హం.

అసలేం జరిగిందంటే..

ఒడిశా గజపతి జిల్లాలో జరిగింది ఈ ఘటన. రాజలక్ష్మి అనే మహిళ, భువనేశ్వర్​లో కొన్నేళ్ల క్రితం ఓ అనాథ పసికందును చూసింది. ఆ శిశువును ఆమె ఆదరించి, పెంచుకోవడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత ఆ బాలికకు పరలఖెముండిలోని కేంద్రీయ విద్యాలయలో అడ్మిషన్​ వచ్చింది. ఆ బాలిక కోసం రాజలక్ష్మి అన్ని వదులుకుని సమీపం ప్రాంతంలోను అద్దె ఇంటికి షిఫ్ట్​ అయ్యింది.

ప్రస్తుతం ఆ బాలిక 8వ తరగతి చదువుకుంటోంది. కాగా ఇటీవలి కాలంలో ఆమెకు గణేశ్​ రథ్​, దినేశ్​ సాహు అనే ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇది రాజలక్ష్మికి తెలిసి, బాలికను మందలించింది. వారిద్దరికి దూరంగా ఉండాలని చెప్పింది.

కానీ ఆ 13ఏళ్ల బాలిక ఆ ఇద్దరిని కలుస్తూనే ఉండేది. చాట్​ చేస్తూనే ఉండేది.

ఓ గుడిలో పూజారిగా పనిచేస్తున్న రథ్​.. బాలికను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. రాజలక్ష్మి ఆస్తి, నగలు, డబ్బులు తీసేసుకోవాలని బాలికను ప్రేరేపించాడు. ఆమె అతనికి లొంగిపోయింది. ఓసారి రాజలక్ష్మి నగలను దోచుకుని, రథ్​కు ఇచ్చింది. వాటిని అతను తాకట్టు పెట్టి రూ. 2.4లక్షలు పొందాడు. ఆ డబ్బుతో కొత్త బైక్​ కొనుక్కుని రాష్ట్రం మొత్తం తిరిగాడు.

కానీ అది అతనికి సరిపోలేదు. రాజలక్ష్మి దగ్గర ఉన్న మరో 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 60వేల క్యాష్​పై కన్నేశాడు.

డబ్బు మీద వ్యామోహంతో చివరికి, రాజలక్ష్మిని చంపేయాలని రథ్​, సాహు, ఆ బాలిక నిర్ణయించుకున్నారు. ఏప్రిల్​ 29న రాజలక్ష్మి ఆహారంలో బాలిక నిద్ర మాత్రలు కలిపింది. ఆమె ఆపస్మారక స్థితిలోకి జారుకున్న అనంతరం తన ఇద్దరు స్నేహితులను ఆ బాలిక ఇంట్లోకి పిలించింది. వారందరు కలిసి రాజలక్ష్మి ముఖం మీద దిండు పెట్టి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశారు.

ఆ తర్వాత ముగ్గురు నాటకం ఆడటం మొదలుపెట్టారు. రాజలక్ష్మికి గుండెపోటు వచ్చిందంటూ.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ రాజలక్ష్మి అప్పటికే ప్రాణాలు విడిచింది. భువనేశ్వర్​లో బంధువుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి.

రాజలక్ష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమెకు గుండె సమస్యలు ముందే ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఆరోగ్యం చెడిపోయి మరణించిందని భావించారు.

కానీ ఇటీవలే రాజలక్ష్మి సోదరుడు సిబ ప్రసాద్​ మిశ్రాకు బాలిక ఫోన్​ కనిపించింది. అందులో ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ ఓపెన్​ చేయగా.. రాజలక్ష్మిని చంపేయాలని ముగ్గురు ప్లాన్​ చేసిన చాట్స్​ కనిపించాయి. సిబ ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. అనాథగా పడి ఉంటే చేరదీసి పెంచుకుంటున్న రాజలక్ష్మిని ఆ బాలిక చంపేయడం అతడని బాధపెట్టింది. చివరికి అతను పోలీసులను ఆశ్రయించాడు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ 13ఏళ్ల బాలిక, రథ్​, సాహులను అరెస్ట్​ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు మూడు ఫోన్లు దొరికాయి. వాటిల్లో మర్డర్​ ప్లాన్​ మొత్తం ఉంది. రాజలక్ష్మి నుంచి దోచుకున్న 30 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.