Nurse molested : బెంగాల్ హాస్పిటల్లో మరో దారుణం- నర్స్పై రోగి లైంగిక దాడి!
పశ్చిమ్ బెంగాల్‌లోని ఓ హాస్పిటల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నైట్ డ్యూటీలో ఉన్న ఓ నర్స్పై, ఓ రోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య సంఘటనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పశ్చిమ్ బెంగాల్లో మరో దారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్లోని ఓ హాస్పిటల్లో నైట్‌షిఫ్ట్‌లో ఉన్న ఓ నర్స్పై ఓ రోగి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
బీర్భూమ్లోని ఇలమ్బజార్ హెల్త్ సెంటర్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. చికిత్స నిమిత్తం, నిందితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లాడు. అక్కడ, నర్స్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనకి సెలైన్ ఎక్కిస్తుండగా నర్స్‌ని పట్టుకున్నాడు.
ఎమర్జెన్సీ వార్డులో రోగికి సాయం చేస్తుండగా, అతను తన మీద లైంగిక దాడికి పాల్పడినట్టు నర్స్ వెల్లడించింది.
"అతను నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వైద్యుడు చెప్పినవి నేను చేస్తుంటే, అతను నా ప్రైవేటు భాగాలను ముట్టుకున్నాడు. నన్ను అసభ్యకరంగా దూషించాడు," అని తనకు జరిగిన విషయాన్ని ఆ నర్స్ వెల్లడించింది.
"హాస్పిటల్స్‌లో భద్రత లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. లేకపోతే కుటుంబ సభ్యుల సమక్షంలో, డ్యూటీలో ఉన్న నర్స్‌తో ఒక రోగి ఈ విధంగా ఎలా ప్రవర్తించగలడు? అతడిని అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నించలేదు," అని నర్స్ వివరించింది.
తాజా ఘటనతో హెల్త్ కేర్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్పిటల్ వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పూర్తి సమాచారాన్ని సేకరించి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, పని ప్రదేశాల్లో డాక్టర్లు, మరీ ముఖ్యంగా మహిళా వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో బెంగాల్లో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. సమస్యకు పరిష్కారం ఏంటి? అనేది అన్ని వర్గాల వారు ఆలోచిస్తున్నారు.
ఇదీ చూడండి:- Rajasthan rape case : 5ఏళ్ల మనవరాలిపై వృద్ధుడి అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
నైట్ షిఫ్ట్స్ అంటే భయం..
కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య నేపథ్యంలో ఐఎంఏ (ఇండియన్ మెడికల్అసోసియేషన్) నిర్వహించిన అధ్యయనం, సర్వేలో పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. నేట్ షిఫ్ట్స్‌లో భద్రత కరువైందని ప్రతి మూడింట ఒక డాక్టర్ అభిప్రాయపడ్డారు. వీరిలో మహిళలే అధికంగా ఉన్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సొంత భద్రత కోసం ఆయుధాలు తీసుకెళ్లాల్సి వస్తుందేమో అని సర్వేలో పాల్గొన్న చాలా మంది వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 3,885 మందిపై ఈ సర్వే జరిగింది. ఇందులో పాల్గొన్న వారిలో చాలా మంది మహిళలే ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 85శాతం మంది 35ఏళ్ల వయస్సులోపు ఉన్నారు. 61శాతం మంది ఇంటర్న్స్ లేదా పీజీ ట్రైనీలు. మొత్తం మీద 63శాతం మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఐఎంఏ కేరళ ఛైర్మన్ డా. రంజీవ్ జయదేవన్, ఆయన టీమ్ ఈ సర్వేని కంపైల్ చేసింది. ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ 2024 అడిషన్లో ఇది పబ్లీష్ కానుంది. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం