ప్రపంచంలో అత్యంత వృద్ధ మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్(114)ను కారుతో ఢీకొట్టిన వ్యక్తిని పంజాబ్‌లోని జలంధర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కర్తార్ పూర్‌లోని దాసుపూర్ గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ (30)గా గుర్తించారు. ఈ రోజు పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు. అతని ఫార్చ్యూనర్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
విచారణలో అమృత్ పాల్ తన నేరాన్ని అంగీకరించాడు. ఫౌజా సింగ్ నడుచుకుంటూ వెళ్తుండగా, అతను గ్రామం నుంచి జాతీయ రహదారి వైపు ఒంటరిగా వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇంతలో వేగంగా వచ్చిన ఫార్చ్యూనర్ కారు ఢీకొట్టి పరారైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఫౌజా సింగ్‌ను జలంధర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనపై ఆదంపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఫార్చ్యూనర్ కారును గుర్తించారు. ఘటనా స్థలంలో హెడ్ లైట్ల పగిలినవి కూడా లభ్యమయ్యాయి. ఈ వాహనం కపుర్తలాలోని అథౌలి గ్రామానికి చెందిన వరీందర్ సింగ్ పేరిట రిజిస్టర్ అయింది. జలంధర్ పోలీసు బృందాలు కపుర్తలాకు చేరుకుని వరీందర్ దగ్గరకు వెళ్లాయి.
కెనడాకు చెందిన అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ అనే ఎన్నారై తన కారును కొనుగోలు చేసినట్లు వరీందర్ సింగ్ విచారణలో వెల్లడించారు. మంగళవారం రాత్రి పోలీసులు అమృత్ పాల్ ను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నారై అమృత్ పాల్ సింగ్ తన నేరాన్ని అంగీకరించాడు. బియాస్ గ్రామ సమీపంలోకి రాగానే ఓ వృద్ధుడిని వాహనం ఢీకొట్టినట్టాడు. అతడు ఫౌజా సింగ్ అని తెలియదు. ప్రమాదం జరిగిన తర్వాత అమృత్ పాల్ భయాందోళనకు గురై హైవేకు బదులుగా గ్రామాల్లో నుంచి వెళ్లాడు.
అమృత్ పాల్ 8 రోజుల క్రితం కెనడా నుంచి తిరిగొచ్చాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫౌజా సింగ్ చిన్న కుమారుడు హర్వీందర్ సింగ్ డిమాండ్ చేశారు. నిందితుడు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ తన తండ్రిని ఢీ కొట్టడమే కాకుండా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. అదే సమయంలో ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.