పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్య తన భర్త అనుమతి తీసుకుని అతని సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రేవతి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ .ఆనంద్ వెంకటేశ్ తాజా ఉత్తర్వుల్లో ఈ మేరకు తీర్పు వెలువరించారు.
దరఖాస్తులో తన భర్త సంతకం ఉండాలని బలవంతం చేయకుండా గడువులోగా కొత్త పాస్ పోర్టు జారీ చేసేలా అధికారులను ఆదేశించాలని రేవతి తన పిటిషన్ లో కోరారు. తనకు 2023లో వివాహం జరిగిందని, ఆ తరువాత తామిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయని, దీంతో తన భర్త వివాహాన్ని రద్దు చేయాలంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని పిటిషనర్ రేవతి కోర్టుకు తెలిపారు. ఆ విడాకుల పిటిషన్ పెండింగ్ లో ఉంది.
పిటిషనర్ రేవతి ఈ ఏడాది ఏప్రిల్ లో చెన్నై నగరంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంలో పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంది. దీన్ని ప్రాసెస్ చేయలేదని, ఫారం-జేలో ఆమె భర్త సంతకం తీసుకోవాలని, ఆ తర్వాతే దరఖాస్తును ఆర్పీవో ప్రాసెస్ చేస్తారని ఆమెకు పాస్ పోర్ట్ కార్యాలయ అధికారులు తెలిపారు. తన భర్తతో హైకోర్టులో పెండింగ్ లో ఉన్న వివాదాన్ని కూడా పిటిషనర్ ఆర్పీవో దృష్టికి తీసుకువెళ్లారు. అయినా, ఆమెకు పాస్ పోర్ట్ ను జారీ చేయడానికిి నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ .ఆనంద్ వెంకటేశ్ మహిళలు పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి భర్త అనుమతి, సంతకం అవసరం లేదని తీర్పునిచ్చారు. పాస్ పోర్టు కోరుతూ పిటిషనర్ దాఖలు చేసిన దరఖాస్తును స్వతంత్రంగా పరిశీలించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. "ఒక భార్య తన భర్త అనుమతిని పొందాల్సిన అవసరం లేదు. అథారిటీ ముందు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు అతని సంతకం తీసుకోవలసిన అవసరం లేదు" అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి తీరును కోర్టు తప్పుబట్టింది. వివాహం చేసుకున్న మహిళలను భర్తకు చెందిన వారిలా చూడటం సరికాదని పేర్కొంది. ‘‘పాస్ పోర్ట్ కోసం పిటిషనర్ సమర్పించిన దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి పాస్ పోర్ట్ కార్యాలయం ఒక నిర్దిష్ట ఫారంలో భర్త అనుమతి మరియు అతని సంతకాన్ని బలవంతం చేయడం చాలా షాకింగ్ గా ఉంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
వివాహానంతరం మహిళలు తన వ్యక్తిత్వాన్ని కోల్పోరని, భర్త అనుమతి లేదా సంతకం లేకుండా భార్య ఏ రూపంలోనైనా పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి భర్త అనుమతి కావాలని పట్టుబట్టడం స్త్రీ విముక్తి దిశగా అడుగులు వేస్తున్న సమాజానికి మంచిది కాదన్నారు. ఈ ఆచారం పురుషాధిక్యతకు తక్కువేమీ కాదని న్యాయమూర్తి అన్నారు. పిటిషనర్ సమర్పించిన దరఖాస్తును పరిశీలించి ఆమె పేరిట పాస్ పోర్టు జారీ చేయాలని న్యాయమూర్తి ఆర్పీవోను ఆదేశించారు. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
సంబంధిత కథనం