Delhi High Court: భార్య, భర్తల మధ్యనే లైంగిక సంబంధం ఉండాలని సామాజిక నిబంధనలు నిర్దేశిస్తున్నాయని, అయితే వైవాహిక స్థితితో సంబంధం లేకుండా ఇద్దరు పెద్దల మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక బంధం ఏర్పడితే అది నేరమేమీ లేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
ఎదుటి వ్యక్తి వైవాహిక స్థితి గురించి తెలిసిన తర్వాత కూడా లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం ప్రాథమికంగా ఆమె సమ్మతిని సూచిస్తుందని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) వ్యాఖ్యానించింది. అతను బలవంతపు సంబంధం పెట్టుకున్నాడని ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు చూపించలేదని పేర్కొంటూ, నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
‘‘ఫిర్యాదు చేయడానికి ముందు కొంత కాలంగా నిందితుడిని పిటిషనర్ కలుస్తుంది. నిందితుడు వివాహితుడనే విషయం తెలిసిన తర్వాత కూడా ఆమె తమ సంబంధాన్ని కొనసాగించిందని స్పష్టమవుతోంది. లైంగిక సంబంధాలు వివాహ పరిమితుల్లోనే జరగాలని సామాజిక నిబంధనలు నిర్దేశిస్తున్నప్పటికీ, వైవాహిక స్థితితో సంబంధం లేకుండా ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక కార్యకలాపాలు జరిగితే నేరంగా భావించలేం’’ అని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ మహాజన్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి ఘటన జరిగిన దాదాపు పదిహేను నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, పిటిషనర్ పై నిందితుడు ఎలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టమవుతోందని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
నిందితుడితో లైంగిక సంబంధం కొనసాగించే విషయంలో ఆ మహిళ మౌన సమ్మతిని తెలిపినట్లు అర్థమవుతోందని కోర్టు పేర్కొంది. నిందితుడిపై చేసిన ఆరోపణలు హేయమైనవే అయినప్పటికీ, అవి శిక్షార్హమైనది కాదని, అందువల్ల బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
లైంగిక దుష్ప్రవర్తన, బలాత్కారం వంటి తప్పుడు ఆరోపణలు నిందితుల ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా నిజమైన కేసుల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల ప్రతి కేసులో నిందితులపై ప్రాథమిక ఆరోపణలను అంచనా వేయడంలో అత్యంత శ్రద్ధ వహించడం అత్యవసరమని అభిప్రాయపడింది. దరఖాస్తుదారుడి వయస్సు 34 సంవత్సరాలు అని, భార్య, ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారని, మార్చి 2023 నుండి కస్టడీలో ఉన్నారని, అతన్ని జైలులో ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తాము భావిస్తున్నామని కోర్టు పేర్కొంది.