Tomato price : కేజీ టమాటా ధర రూ. 250- 'మా ఫుడ్‌లో ఇక వాడట్లేదు'- మెక్‌డీ!
Tomato price in India : ఓవైపు టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతుంటే.. మరోవైపు ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కస్టమర్లు షాక్ అవుతున్నారు.
Tomato price in India : దేశంలో టమాటా ధరలు పెరుగుతున్న తీరు చూసి అందకు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సామాన్యుడి గుండెపై టమాటా భారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకటి, రెండు ప్రాంతాలు అని కాకుండా.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో కేజీ టమాటా ధర రూ. 250ని తాకడం గమనార్హం. మరోవైపు తాజా పరిణామాల మధ్య ప్రముఖ ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ఫుడ్‌లో టమాటాలు ఉండవని తేల్చి చెప్పి కస్టమర్లకు షాక్ ఇచ్చింది.
టమాటా ధరలకు రెక్కలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కేజీ టమాటా రూ. 120 కన్నా ఎక్కువగానే అమ్ముడవుతోంది. కాగా.. ఉత్తరాఖండ్‌లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. గంగోత్రి ధామ్‌లో కేజీ టమాటా ధర రూ. 250ని తాకింది. ఉత్తర కాశీ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కేజీ టమాటా రూ. 180 నుంచి రూ. 200 మధ్యలో ఉంది.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంట చేతికి అందలేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో.. భారీ ఉష్ణోగ్రతల కారణంగా అసలు పంటే పండలేదు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో డిమాండ్- సప్లైకి మధ్య వ్యత్యాసం చాలా పెరిగిపోయింది. ఫలితంగా టమాటా రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి.
నిత్యావసర వస్తువల్లో టమాటాలు, ఉల్లిగడ్డలు చాలా కీలకం. వీటిని త్వరగా వాడుకోకపోతే, కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే టమాటాలను నిల్వ ఉంచి, తర్వాత వాడుకునే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జేబులకు చిల్లు పడుతున్నా.. చాలా మంది టమాటాలను కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
టమాటాలు ఉండవు- మెక్‌డీ..
Tomato price latest news : దిల్లీలోనూ టమాటా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కేజీ టమాటా ధర రూ. 110- రూ. 120 మధ్య పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ ఔట్లెట్ మెక్‌డీ ఓ నిర్ణయం తీసుకుంది. తమ ఫుడ్‌లో టమాటాలు వాడకూడదని ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆదిత్య షా ట్వీట్ చేశారు. ట్వీట్లో మెక్‌డీకి సంబంధించిన నోటీసు ఉంది.
"దిల్లీ మెక్‌డొనాల్డ్స్‌లో ఈ నోటీసు కనిపించింది. మెక్‌డీ కూడా భరించలేనంతగా టమాటా ధరలు పెరిగిపోయాయి," అని ఆదిత్య షా ట్వీట్ చేశారు.
McDonald tomato notice : నాణ్యమైన టమాటాలను కొనుగోలు చేయలేకపోతున్నామని, మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే వాటిని తమ ఫుడ్‌లో వాడట్లేదని మెక్‌డీ నోటీసులో రాసి ఉంది. మరి ఇది ఒక్క ఔట్లెట్కో వర్తిస్తుందా? లేకా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. పాపం మెక్‌డీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం.. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు! ప్రభుత్వాలు మందుకొచ్చి.. ప్రజలు సాయం చేయాలని కోరుతున్నారు.
వాస్తవానికి పలు ప్రభుత్వాలు ఇప్పటికే ముందుకొచ్చాయి. సామాన్యుడిపై భారం పడకుండా.. మార్కెట్లో సబ్సిడీకి, తక్కువ ధరకే టమాటాలను ఇస్తున్నాయి.
సంబంధిత కథనం