No snowfall in Gulmarg : గుల్మార్గ్​లో కనిపించని 'మంచు'- కశ్మీర్​కు ఏమైంది?-no snowfall in gulmarg tourists ski enthusiasts dejected ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  No Snowfall In Gulmarg : గుల్మార్గ్​లో కనిపించని 'మంచు'- కశ్మీర్​కు ఏమైంది?

No snowfall in Gulmarg : గుల్మార్గ్​లో కనిపించని 'మంచు'- కశ్మీర్​కు ఏమైంది?

Sharath Chitturi HT Telugu
Jan 09, 2024 09:34 AM IST

No snowfall in Gulmarg : శీతాకాలం అంటే ముందుగా గుర్తొచ్చే కశ్మీర్​ గుల్మార్గ్​లో డ్రై స్పెల్​ నడుస్తోంది! అక్కడ సరిగ్గా మంచు కురవడం లేదు. ఇది పర్యాటకులు, వ్యాపారులను ఇబ్బంది పెడుతోంది.

గుల్మార్గ్​లో కనిపించని 'మంచు'- కశ్మీర్​కు ఏమైంది?
గుల్మార్గ్​లో కనిపించని 'మంచు'- కశ్మీర్​కు ఏమైంది?

No snowfall in Gulmarg : శీతాకాలం అంటే ప్రకృతి ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చే ప్రాంతం.. 'కశ్మీర్​'. వింటర్​లో మంచు దుప్పటిలో కూరుకుపోయి.. కశ్మీర్​ లోయ అందాలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలోనే టూరిస్ట్​ ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడిపోతూ ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైనది.. గుల్మార్గ్​. శీతాకాలంలో ఈ ప్రాంతం అందాలు రెట్టింపు అవుతాయి. అందరి బకెట్​ లిస్ట్​లో కచ్చితంగా ఉండే పేరు ఈ గుల్మార్గ్​. అలాంటి గుల్మార్గ్​లో ప్రస్తుతం మంచు కురవడం లేదు! శీతాకాలం సగం గడిచిపోయినా.. అక్కడ ఈసారి ఇప్పటికీ హిమపాతం సరిగ్గా లేకపోవడం.. అటు పర్యాటకులను, ఇటు టూరిజంపై ఆధారపడి జీవిస్తున్న వ్యాపారులను కలవరపెడుతోంది.

గుల్మార్గ్​లో మంచు కురవడం లేదు..!

గుల్మార్గ్​లో ప్రస్తుతం డ్రై స్పెల్​ కొనసాగుతోంది. మంచు కురువక.. అక్కడి ప్రకృతి ప్రదేశాలు వెలవెలబోతున్నాయి. పర్యాటకంపై ఈ ఎఫెక్ట్​ ఇప్పటి వరకు పడలేదు కానీ.. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Gulmarg snowfall news today : "గుల్మార్గ్​లో ఎక్కడా మంచు కనిపించడం లేదు. కశ్మీర్​ లోయలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎఫెక్ట్​ ప్రస్తుతం టూరిజంపై లేదు. కానీ మంచు ఎంత త్వరగా కురుస్తే అంత మంచిది. లేకపోతే రానున్న రోజుల్లో పర్యటకుల సంఖ్య పడిపోవచ్చు," అని గుల్మార్గ్​ టూరిజం అసిస్టెంట్​ డైరక్టర్​ జావైద్​ ఉర్​ రెహ్మాన్​ తెలిపారు.

కశ్మీర్​ టూరిజంలో గుల్మార్గ్​కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎల్​ఓసీకి అతి సమీపంలో ఉండే ఈ ప్రాంతం.. పీర్​ పంజల్​ పర్వతాల కిందకు వస్తుంది. కప్​ షేప్​లో ఉండే ఈ లోయ.. అనేక ప్రకృతి అందాలకు నెలవు. 2023లో 1.65 మిలియన్​ మంది పర్యటకులు గుల్మార్గ్​ని సందర్శించారు. ఇదొక రికార్డ్​. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో.. మంచు సరిగ్గా పడకపోవడం భయపెడుతోంది.

Gulmarg snowfall latest news : మరోవైపు.. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఆ ప్రాంతంలో నేషనల్​ వింటర్​ గేమ్స్​ జరగాల్సి ఉంది. మంచు సరిగ్గా లేకపోతే.. వింటర్​ స్పోర్ట్స్​తో పాటు స్కీయింగ్​ వంటి అడ్వెంచర్​ స్పోర్ట్స్​కి ఇబ్బందులు వస్తాయి.

ఎల్​ నీనో ప్రభావం వల్లే..!

కశ్మీర్​లో శీతాకాలం అంటే కఠినంగానే ఉంటుంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమైపోతాయి. మరీ ముఖ్యంగా.. 40 రోజుల వింటర్​ పీరియడ్​, అతి కఠినంగా ఉంటుంది. దీనిని.. చిల్లా-ఐ-కలాన్​ అని పిలుస్తారు. డిసెంబర్​ 21న ఈ చిల్లా-ఐ-కలాన్​ ప్రారంభమైంది. జనవరి 31 వరకు ఉంటుంది. అయితే.. ఎల్​ నీనో ఎఫెక్ట్​ కారణంగానే ఈసారి సరిగ్గా మంచు కురవడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

No snowfall in Kashmir : "గత 3-4 ఏళ్లల్లో కశ్మీర్​లో శీతాకాలం చాలా తొందరగా ప్రారంభమైంది. కానీ ఈసారి ఆలస్యమైంది. అందుకే ఇంకా.. అనుకున్నంత స్థాయిలో మంచు కురవడం లేదు. జనవరి 16 వరకు ఇదే పరిస్థితులు కొనసాగొచ్చు. ఎల్​ నీనో ఇందుకు కారణం. నవంబర్​ నుంచి ఈ ప్రాంతాన్ని ఎల్​ నీనో ఇబ్బంది పెడుతోంది. జనవరి చివరి వరకు ఎఫెక్ట్​ ఉండొచ్చు. అయితే.. ఎల్​ నీనో వచ్చిన ప్రతిసారి డ్రై స్పెల్​ కనిపించలేదు. 2022లో, 2018లో, 2015లో ఎల్​ నీనో ఎఫెక్ట్​ పడింది. కానీ అప్పుడు మంచు బాగానే కురిసింది. ఈసారి మాత్రమే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి," అని శ్రీనగర్​ వాతావరణ విభాగం డైరక్టర్​ ముఖ్తర్​ అహ్మద్​ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం