Nitish Kumar: ప్రధాని అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ లో కీలక మిత్రపక్షమైన జేడీ యూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గైర్హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ కీలకమైన కార్యక్రమానికి నితీష్ కుమార్ గైర్హాజరు కావడం సంచలనంగా మారింది. నితీశ్ గైర్హాజరు కావడానకిి గల కారణం ఇంకా తెలియరాలేదు. కానీ, బిహార్ నుంచి నీతి ఆయోగ్ భేటీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. వీరిద్దరు బిహార్ లో నితీశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలు.
కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ప్రజా విధాన థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ సమావేశానికి బిహార్ సీఎం హోదాలో నితీశ్ కుమార్ హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి కాదని నితీశ్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) నేత ఒకరు వెల్లడించారు. గతంలో కూడా పలు నీతి ఆయోగ్ సమావేశాలకు సీఎం నితీశ్ హాజరు కాలేదని, అప్పుడు కూడా బిహార్ నుంచి అప్పటి డిప్యూటీ సీఎం హాజరయ్యారని తెలిపారు. అదే విధంగా, ఈసారి కూడా ఇద్దరు డెప్యూటీ సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన నలుగురు సభ్యులు ఆయోగ్ లో సభ్యులుగా ఉన్నారని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు.
ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను గెలవలేకపోయింది. సొంతంగా మెజారిటీ వస్తుందని ఆశించినప్పటికీ, అది సాధ్యం కాలేదు. దాంతో, మిత్రపక్షాల మద్ధతుతో, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. బిహార్ నుంచి 12 సీట్లు గెల్చుకున్న జేడీయూ, ఆంధ్ర ప్రదేశ్ నుంచి 16 సీట్లు గెల్చుకున్న టీడీపీ లు అధికార ఎన్డీఏ లో కీలకంగా మారాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అందువల్ల, అధికారంలో కొనసాగాలంటే జేడీయూ, టీడీపీల మద్దతు అవసరం.
నితీష్ కుమార్ పదేపదే మిత్రపక్షాలను మారుస్తారనే అపఖ్యాతి ఉంది. లోక్ సభ ఎన్నికలకు ముందు జనవరిలో కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి ఉన్న మహాకూటమి నుంచి బయటకు వెళ్లి, బీజేపీతో కలిశారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు, కేంద్ర బడ్జెట్లో ఎన్డీయేతర రాష్ట్రాలను ఎన్డీయే ప్రభుత్వం విస్మరించిందని, ఆంధ్రప్రదేశ్, బిహార్ లకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సదస్సును బహిష్కరించారు. అయితే, ఈ భేటీకి హాజరైన పశ్చిమ బెంగాల్ సీఎం మమత తనకు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారని ఆరోపిస్తూ, సమావేశం నుంచి వెళ్లిపోయారు.