NIT Silchar: లైంగిక వేధింపుల కేసులో నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై సస్పెన్షన్ వేటు-nit silchar assistant professor suspended for alleged sexual harassment ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nit Silchar: లైంగిక వేధింపుల కేసులో నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై సస్పెన్షన్ వేటు

NIT Silchar: లైంగిక వేధింపుల కేసులో నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై సస్పెన్షన్ వేటు

Sudarshan V HT Telugu

NIT Silchar: లైంగిక వేధింపుల కేసులో నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై సస్పెన్షన్ వేటు పడింది. తనకు తక్కువ మార్కులు రావడంపై చర్చించేందుకు తన చాంబర్ కు పిలిపించుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరాజు తనను అసభ్యంగా తాకాడని ఓ విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది.

అస్సాంలోని సిల్చార్ నిట్ లో లైంగిక వేధింపులకు నిరసన తెలుపుతున్న విద్యార్థులు

NIT Silchar: అసోంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) సిల్చార్ లో ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పై సస్పెన్షన్ వేటు పడింది. తక్కువ మార్కులు రావడంపై చర్చించేందుకు గురువారం తన చాంబర్ కు పిలిపించుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరాజు తనను అనుచితంగా తాకాడని విద్యార్థిని ఆ నోట్ లో పేర్కొంది. 'నా స్కోర్లకు కారణాన్ని వివరించమని అతను నన్ను అడిగాడు. అకస్మాత్తుగా నన్ను తాకడం ప్రారంభించాడు. సౌకర్యవంతంగా ఉండమని కోరాడు. నేను అతని మాట వింటే నా మార్కులను తాను చూసుకుంటానని చెప్పాడు" అని ఆమె చేతిరాతతో రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలీసుల స్పందన

సిల్చార్ నిట్ లో లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన అస్సాం పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరాజు తన తొడలు, బొడ్డు, మెడ, పెదవులను తాకాడని విద్యార్థిని తెలిపింది. ‘‘తనతో కూర్చోమని చెప్పి, ఆ తర్వాత నన్ను వెనుక నుంచి లాక్కుని నా శరీర భాగాల గురించి మాట్లాడాడు. ఆ సమయంలో ఓ స్నేహితుడు ఫోన్ చేయడంతో నేను ఆ గది నుంచి బయటకు పరుగెత్తాను’’ అని ఆమె వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరాజును తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజు సస్పెన్షన్ కు అధికారులు హామీ ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఆందోళన విరమించారు.

గతంలో కూడా..

అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరాజు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడని, అతనిపై ఇది రెండో అధికారిక ఫిర్యాదు అని విద్యార్థులు ఆరోపించారు. ‘అలాంటి వ్యక్తి మాకు పాఠాలు చెప్పడం మాకు ఇష్టం లేదు' అని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. 2021 లో ఒక విద్యార్థిని రాజుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కేసులో స్థానిక కోర్టు రాజును నిర్దోషిగా ప్రకటించింది, సాక్ష్యాధారాలు లేకపోవడంతో పాటు విచారణ సమయంలో ఫిర్యాదుదారు గైర్హాజరు కావడంతో కోర్టు ఆ తీర్పునిచ్చింది. ‘‘అతనిపై ఫిర్యాదు చేసిన విద్యార్థిని 2021 లో జాబ్ నిమిత్తం బెంగళూరుకు వెళ్లింది. కేసును కొనసాగించడానికి తరచూ అస్సాంకు వెళ్లడం ఆమెకు కష్టంగా మారింది. దీంతో కోర్టు ప్రొఫెసర్ ను నిర్దోషిగా తేల్చింది’’ అని మరో విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.

అంతర్గత విచారణ

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం, పరిష్కార) చట్టం కింద నిట్ అంతర్గత ఫిర్యాదు కమిటీ తాజా ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరాజు ను సస్పెండ్ చేస్తున్నట్లు నిట్ ప్రకటించింది. తాము ఇన్స్టిట్యూట్ తో టచ్ లో ఉన్నామని, అయితే లిఖితపూర్వక ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసు సూపరింటెండెంట్ నుమల్ మహత్తా తెలిపారు. పోలీసు బృందం కూడా క్యాంపస్ ను సందర్శించింది.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.