Nipah virus Kerala : ‘భయపడాల్సిన అవసరం లేదు’- నిపా వైరస్ పరిస్థితిపై కేరళ
Nipah virus Kerala : నిపా వైరస్ విషయంపై భయపడాల్సిన పని లేదని కేరళ పేర్కొంది. వైరస్ ప్రస్తుతం కంట్రోల్లోనే ఉందని స్పష్టం చేసింది.
Nipah virus Kerala : కేరళలో నిపా వైరస్ కలకలం నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు కంట్రోల్లో ఉన్నట్టు వెల్లడించారు. 200కుపైగా అనుమానిత శాంపిళ్లను పరీక్షించగా.. అవన్నీ నెగిటివ్‌గా వచ్చినట్టు స్పష్టం చేశారు.
కేరళలో ఆరు నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొజికోడ్ జిల్లాలోనే ఈ కేసులన్నీ నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. వీరితో సన్నిహితంగా ఉన్న 1233మందిని ట్రేస్ చేసి, ఐసొలేషన్‌లో పెట్టింది స్థానిక యంత్రాంగం. కానీ తాజాగా కేసులేవీ నమోదు కాలేదని వీనా జార్జ్ తెలిపారు.
"అన్నిటికన్నా సానుకూల విషయం ఏంటంటే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాలుగురి ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది. వీరిలో.. ఇంతకాలం వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్న 9ఏళ్ల బాలుడి ఆరోగ్యం కూడా మెరుగు అవుతోంది," అని వీనా జార్జ్ అన్నారు. కేరళ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు.
"ఇప్పటివరకు ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. 3 రోజులుగా పరీక్షిస్తున్న శాంపిళ్లన్నీ నెగిటివ్‌గానే ఉన్నాయి. కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తోంది. 19 బృందాలు.. క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసి, నిపా వైరస్ సంబంధిత నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది," అని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి:- Nipah virus in Kerala : అంతకంతకు పెరుగుతున్న 'నిపా' కేసులు.. కేరళలో కొవిడ్ తరహా పరిస్థితి!
నిపా వైరస్ నేపథ్యంలో మూడు కేంద్ర బృందాలు (ఐసీఎంఆర్, ఎన్ఐవీ, ఎపిడెమియోలాజికల్ ఇన్స్టిట్యూట్) కేరళలో పర్యటిస్తున్నాయి. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనిని కేంద్ర బృందం సైతం ప్రశంసించినట్టు తెలుస్తోంది.
"కేంద్ర బృందాలు అన్ని చర్చల్లో పాల్గొంటాయి. ప్రతి రోజు.. తాజా పరిస్థితులను మా బృందాలు వారికి వివరిస్తాయి," అని వీనా జార్జ్ స్పష్టం చేశారు.
నిపా వైరస్ అంటే ఏంటి..?
గబ్బిలాలు, పందుల నుంచి మనిషికి వ్యాపించేదే ఈ నిపా వైరస్. కొన్నేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన కొవిడ్ తరహాలోనే ఇదీ ఉంటుంది. తొలుత జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఆ తర్వాత.. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది.
ఈ నిపా వైరస్‌కు ఇప్పటికీ సరైన చికిత్స లేకపోవడం, వ్యాక్సిన్ సైతం అందుబాటులో లేకపోవడం ఆందోళనకర విషయం.
సంబంధిత కథనం