New snake species: హిమాలయాల్లోని కొత్త పాము జాతికి టైటానిక్ సినిమా హీరో ‘లియోనార్డో డికాప్రియో’ పేరు
New snake species: హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొత్త పాము జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త పాము జాతికి శాస్త్రవేత్తలు ‘‘అంగుయిక్యులస్ డికాప్రియోయ్’’ లేదా ‘‘డికాప్రియో హిమాలయన్ స్నేక్’’ అని పేరు పెట్టారు. ఈ కొత్త జాతిని 2020లో భారత్, జర్మనీ, బ్రిటన్ కు చెందిన పరిశోధకుల బృందం కనుగొంది.
Leonardo DiCaprio: పశ్చిమ హిమాలయాల్లో భారత్, జర్మనీ, బ్రిటన్ కు చెందిన పరిశోధకుల బృందం కనుగొన్న కొత్త పాము జాతికి హాలీవుడ్ నటుడు, నిర్మాత లియోనార్డో డికాప్రియో పేరు పెట్టారు. ‘‘అంగుయిక్యులస్ డికాప్రియోయ్’’ లేదా ‘‘డికాప్రియో హిమాలయన్ స్నేక్’’ అని ఆ పాము జాతికి నామకరణం చేశారు. ఈ కొత్త పాము జాతిని 2020 లో భారతదేశం, జర్మనీ మరియు యూకే కు చెందిన పరిశోధకుల బృందం గుర్తించింది. భారతదేశ సరీసృపాలపై ఒక ప్రాజెక్టులో భాగంగా అంతగా తెలియని జాతుల పాముల కోసం అన్వేషిస్తుండగా ఈ పాము జాతిని పరిశోధకుల బృందం కనుగొంది. వారి ఆవిష్కరణ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో సోమవారం ప్రచురితమైంది. పరిశోధకులు ఈ కొత్త జాతిని లాటిన్ భాషలో 'చిన్న పాము' అని అర్థం వచ్చే 'అంగుక్యులస్' అనే కొత్త జాతి కింద వర్గీకరించారు.
లియోనార్డో డికాప్రియో గౌరవార్థం
ప్రపంచ వాతావరణ మార్పులు, పెరిగిన జీవవైవిధ్య నష్టం, కాలుష్యం ద్వారా తలెత్తుతున్న మానవ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంలో, ఆయా కార్యక్రమాలకు నిధులు సమకూర్చడంలో ఎంతో సహకారం అందిస్తున్న హాలీవుడ్ నటుడు, నిర్మాత, పర్యావరణవేత్త లియోనార్డో డికాప్రియో (Leonardo DiCaprio) గౌరవార్థం ఆ పాము జాతికి 'డికాప్రియోయి' అనే ప్రత్యేక గుర్తింపును ఇచ్చినట్లు అధ్యయనం పేర్కొంది. 'డికాప్రియో హిమాలయన్ స్నేక్' అనే సాధారణ పేరును సూచించింది.
హిమాచల్ ప్రదేశ్ లో..
ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకుల బృందం హిమాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ హిమాలయాల్లోని పర్వత ప్రాంతాలను సందర్శిస్తుండగా మట్టి రోడ్డుపై కొన్ని గోధుమ రంగు పాములు కనిపించాయి. మనుషులను చూడగానే, అవి కదలకుండా ఉండిపోయారని, కాటు వేసే ప్రయత్నాలు చేయలేదని అధ్యయనం పేర్కొంది. ఈ పాముల అధ్యయనం, వాటి డీఎన్ఏ విశ్లేషణ, ఇతర పాములతో పోల్చడం కొత్త జాతి ఆవిష్కరణకు దారితీసింది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కులు వంటి ప్రాంతాల్లోనే కాకుండా ఉత్తరాఖండ్ లోని నైనిటాల్, నేపాల్ లోని చిత్వాన్ నేషనల్ పార్కులో కూడా ఈ కొత్త జాతిని కనుగొన్నట్లు మిజోరం యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ప్రొఫెసర్, పరిశోధకుల బృందంలో సభ్యుడు హెచ్ టీ లాల్రెమ్సంగా తెలిపారు. జీషాన్ ఎ మీర్జా, వీరేంద్ర కె భరద్వాజ్, సౌనక్ పాల్, గెర్నోట్ వోగెల్, పాట్రిక్ డి క్యాంప్బెల్, హర్షిల్ పటేల్ ఈ బృందంలోని ఇతర పరిశోధకులు.
ఈ పాము జాతి వివరాలు
డజన్ల కొద్దీ దంతాలు ఉన్న ఈ కొత్త పాము జాతి సుమారు 22 అంగుళాల వరకు పెరుగుతుంది. "చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలతో వెడల్పాటి కాలర్" "దృఢమైన పుర్రె" మరియు "నిటారుగా ఉన్న పుర్రె" కలిగి ఉంటుంది. ఇవి సముద్ర మట్టానికి సుమారు 6,000 అడుగుల ఎత్తులో నివసిస్తాయి.