Maharashtra new CM: ‘మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరంటే..’: స్పష్టతనిచ్చిన అజిత్ పవార్
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే విషయంలో కొంత స్పష్టత వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీకే దక్కుతుందని కూటమి భాగస్వామ్య పార్టీ నేత అజిత్ పవార్ శనివారం స్పష్టం చేశారు. కూటమిలోని శివసేన, ఎన్సీపీల నుంచి ఒక్కో ఉప ముఖ్యమంత్రి ఉంటారని చెప్పారు.
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ నుండి ఉంటారని, మహాయుతి మిత్రపక్షాల నుండి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని అజిత్ పవార్ శనివారం చెప్పారు. ‘రాష్ట్రంలో బిజెపి నుండి ఒక ముఖ్యమంత్రి, మహాయుతిలోని ఇతర రెండు పార్టీల నుండి ఇద్దరు డిప్యూటీలు ఉంటారు. డిసెంబర్ 5న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది’ అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ తెలిపారు.
డిసెంబర్ 5 న ప్రమాణ స్వీకారం
ముంబైలోని ఆజాద్ మైదానంలో డిసెంబర్ 5న కొత్త మహాయుతి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే ధృవీకరించిన నేపథ్యంలో అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2024 డిసెంబర్ 5వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు ముంబై (mumbai) లోని ఆజాద్ మైదానంలో ప్రపంచం గర్వించదగ్గ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది’’ అని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే ఎక్స్ లో పోస్ట్ చేశారు.
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాలు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించాయి. ఆపద్ధర్మ సిఎం ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ గురువారం దేశ రాజధానిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amith shah), బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు. ఈ సమావేశానికి ముందు, షిండే మీడియాతో మాట్లాడుతూ, తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యత ప్రధాని మోదీదేనన్నారు. బిజెపి అగ్ర నాయకత్వం ముఖ్యమంత్రి పదవిపై ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఆమోదయోగ్యమేనని షిండే స్పష్టం చేశారు. కాగా, శివసేన నేత శంభురాజ్ దేశాయ్ మాట్లాడుతూ మహాయుతి సీనియర్ నేతలు కూర్చుని మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తారని చెప్పారు.
బీజేపీ ఎల్పీ సమావేశం
‘‘మంత్రిత్వ శాఖలపై పార్టీ సీనియర్ నేతలు చర్చిస్తున్నారు. ముగ్గురు నాయకులు కలిసి కూర్చుని చర్చించిన తర్వాత ప్రతిదానికీ ఒక ఫార్ములా తయారు చేస్తారు. సోమవారం (డిసెంబర్ 2) బీజేపీ (bjp) శాసనసభా సమావేశం జరుగుతుంది. వారు తమ పార్టీ శాసనసభా నాయకుడిని ఎన్నుకుంటారని నాకు ముందే సమాచారం అందింది’’ అని దేశాయ్ పేర్కొన్నారు. శివసేన, ఎన్సీపీలు ఇప్పటికే ఏక్ నాథ్ షిండే (eknath shinde), అజిత్ పవార్ లను తమ పార్టీల నేతలుగా ఎంపిక చేసుకున్నాయి. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రివర్గం, శాఖల ఫార్ములాను ముగ్గురు నేతలు నిర్ణయిస్తారని తెలిపారు.