NEET UG Counselling 2024 : నీట్ యూజీ కౌన్సెలింగ్ ఎప్పుడు మెుదలవుతుంది? ఏమేం పత్రాలు ఉండాలి?
NEET UG Counselling 2024 : NEET UGపై సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందనేది ప్రశ్న అందరిలోనూ ఉంది. జులై 24 కౌన్సెలింగ్ ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి.
నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు కోర్టు నిరాకరించింది. ఫిజిక్స్‌కు సంబంధించిన వివాదాస్పద ప్రశ్నపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు నీట్ యూజీ కౌన్సెలింగ్ జులై 24 నుంచి ప్రారంభం కావచ్చని కొన్ని మీడియా కథనాలలో వచ్చాయి. కానీ ఇది జరగడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే నీట్ పరీక్షలో అడిగిన ఓ ప్రశ్నకు నాల్గో ఎంపికను సరైన సమాధానంగా పరిగణించి ఫలితాన్ని సవరించాలని సుప్రీంకోర్టు NTAని ఆదేశించింది.
NTA NEET UGని సవరించి కొత్త ఫలితాలను విడుదల చేస్తుంది. దీనికి కనీసం ఒకటి నుండి రెండు రోజులు పడుతుంది. ఫలితాలు మారినప్పుడు అభ్యర్థుల ర్యాంకింగ్, టాపర్ జాబితా కూడా మారుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వారం నుంచే నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల్లో తుది ఫలితాలు వెల్లడిస్తామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 'సత్యమేవ జయతే.. కోర్టు నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. దేశంలోని విద్యార్థులకే మా ప్రాధాన్యత. నీట్ UGలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటాం. ఏ పరీక్షలోనైనా తప్పుడు వ్యవహారాలు జరిగితే సహించేది లేదు.' ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభమవుతుందని ఎన్‌టీఏ సుప్రీంకోర్టులో గత విచారణలో తెలిపింది. ఇది కాకుండా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ కూడా జూలై 20 నాటికి పోర్టల్‌లో సీట్ల వివరాలను అప్‌లోడ్ చేయాలని మెడికల్ కాలేజీలను కోరింది. అయితే పేపర్ లీకేజీ, సుప్రీం కోర్టులో విచారణతో ఈ తేదీలు మారాయి. నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియను జూలై చివరి వారంలో ప్రారంభించవచ్చని అంచనా.
MCC ఇచ్చిన సమాచారం ప్రకారం, NEET UG కౌన్సెలింగ్ మూడు రౌండ్లలో జరుగుతుంది. NEET UG కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ MCC వెబ్‌సైట్ mcc.nic.inలో విడుదల చేస్తారు.
కౌన్సెలింగ్ సెషన్ విషయానికి వస్తే, ఎంసీసీ నీట్ కౌన్సెలింగ్ అఖిల భారత కోటా కింద 15 శాతం సీట్లను నిర్వహిస్తుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియాలోని డెంటిస్ట్రీ ఫ్యాకల్టీ వంటి సెంట్రల్ యూనివర్సిటీల్లో సీట్లు ఉన్నాయి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ), పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ పరిధిలోని కాలేజీల్లో సీట్లకు ఇది వర్తిస్తుంది.
కౌన్సెలింగ్ కోసం కావాల్సినవి
నీట్ యూజీ అడ్మిట్ కార్డు, నీట్ యూజీ స్కోర్ కార్డు, ఆధార్ లేదా పాన్ కార్డు, 12వ తరగతి మార్క్ షీట్, సర్టిఫికేట్స్ ఒరిజినల్, అటెస్టెడ్ కాపీలు, ఆరు నుండి ఎనిమిది పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం కావాలి.
టాపిక్