NEET UG Counselling 2023: నీట్ యూజీ కౌన్సెలింగ్ కు సిద్ధమవుతున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..
NEET UG Counselling 2023: వైద్య విద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ యూజీ (NEET UG) ఫలితాలు వెలువడ్డాయి. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రాష్ట్రాల వారీ కోటా, అర్హతలు, తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
NEET UG Counselling 2023: నీట్ యూజీ (NEET UG) ఫలితాలను ప్రకటించడంతో కొన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు
Two categories: రెండు కేటగిరీలుగా..
నీట్ స్కోర్స్ ఆధారంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ రెండు కేటగిరీల్లో జరుగుతుంది. ఒకటి ఆల్ ఇండియా కోటా. ఇందులో 15% సీట్లు ఉంటాయి. మరొకటి స్టేట్ కోటా. ఈ రాష్ట్ర కోటాలో ఆయా రాష్ట్రాల విద్యార్థులకు 85% సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్ ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (Medical Counselling Committee MCC) తమ అధికారిక వెబ్ సైట్ mcc.nic.in. ద్వారా నిర్వహిస్తుంది. అయితే, నీట్ యూజీ కౌన్సెలింగ్ ను ప్రారంభించడానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Statewise authority: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అథారిటీ..
నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అథారిటీ ఉంటుంది. ఆ కమిటీ రాష్ట్ర కోటా (85%) కు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మెడికల్ లేదా డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్ కావాలనుకునే విద్యార్థులు నీట్ యూజీ కౌన్సెలింగ్ లో కచ్చితంగా పాల్గొనాలి. ముందుగా రిజిస్టర్ చేసుకుని, తమకు ఆసక్తి ఉన్న కాలేజీల్లో తమకు అర్హత ఉన్న కోర్సులను ఎంపిక చేసుకుని, అవసరమైన ఫీజు చెల్లించి కౌన్సెలింగ్ కు సిద్ధంగా ఉండాలి. విద్యార్థుల ఎంపిక, వారి నీట్ స్కోర్, రిజర్వేషన్ తదితర అర్హతల ఆధారంగా మెడకల్, డెంటల్ కాలేజీల్లో వారికి అడ్మిషన్ లభిస్తుంది.
MCC purview: ఎంసీసీ పరిధిలో..
అన్ని ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటా పరిధిలోకి వచ్చే 15% సీట్ల కౌన్సెలింగ్ ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (Medical Counselling Committee MCC) నిర్వహిస్తుంది. అలాగే, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంఎస్, ఎయిమ్స్, జిప్మర్ కాలేజీల్లో అడ్మిషన్లను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లను కూడా ఎంసీసీనే చూస్తుంది. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ 4 రౌండ్లలో జరుగుతుంది.