NEET UG 2024 row: ‘నీట్ యూజీ 2024 ప్రశ్నాపత్రం లీకైన విషయం వాస్తవమే’: ఒప్పుకున్న నీట్ విద్యార్థి
NEET UG 2024 row: వైద్య విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లకు నిర్వహించే నీటీ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ అయిందని నిర్ధారణ అయంది. తనకు అందిన లీకైన ప్రశ్నపత్రం వాస్తవ పరీక్ష ప్రశ్నాపత్రంతో సరిపోలిందని నీట్ యూజీ 2024 పరీక్ష రాసిన బిహార్ కు చెందిన విద్యార్థి అనురాగ్ యాదవ్ అంగీకరించాడు.
NEET UG 2024 row: తనకు అందిన లీకైన ప్రశ్నాపత్రం వాస్తవ పరీక్ష ప్రశ్నాపత్రంతో సరిపోలిందని నీట్ యూజీ 2024 పరీక్ష రాసిన 22 ఏళ్ల బిహార్ విద్యార్థి అనురాగ్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షకు ఒక రోజు ముందు పరీక్షా పత్రాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై బిహార్ కు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో అనురాగ్ యాదవ్ మామ, బీహార్ లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్ ఇంజనీర్ సికందర్ ప్రసాద్ యాదయేందు కూడా ఉన్నారు.
వీరికే పేపర్ అందింది
అనురాగ్ యాదవ్ తో పాటు నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ అనే మరో ఇద్దరికి కూడా పరీక్ష తేదీకి ఒక రోజు ముందు నీట్ యూజీ 2024 పేపర్ అందిందని, వారు కూడా ఆ పరీక్ష రాశారని, వారిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
సుప్రీంకోర్టులో విచారణ
కాగా, వివిధ హైకోర్టుల నుంచి కేసులను బదిలీ చేయాలని కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. నీట్-యూజీ (NEET UG 2024) పరీక్ష విచారణ, ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రద్దు, పునఃపరిశీలన తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది.
బిహార్ పోలీసుల నుంచి నివేదిక
పాట్నాలో నీట్ (యూజీ) పరీక్ష 2024 నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విద్యా మంత్రిత్వ శాఖ బిహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం నుండి వివరణాత్మక నివేదికను కోరింది. నీట్ యూజీకి సంబంధించిన గ్రేస్ మార్కుల సమస్యను ఇప్పటికే పూర్తిగా పరిష్కరించినట్లు విద్యాశాఖ జూన్ 19న ఒక ప్రకటనలో తెలిపింది.