Kota suicide: ‘‘సారీ నాన్నా.. ఈ సారి కూడా సాధించలేకపోయా’’ - కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
Kota suicide: రాజస్తాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక పదుల సంఖ్యలో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, నీట్ ప్రిపరేషన్ కోసం రాజస్థాన్ లోని ధోల్పూర్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి బలవన్మరణం చెందాడు.
Kota suicide: అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)కు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్ లోని కోటా (Kota) లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నీట్ కు ప్రిపేర్ అవుతున్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లోపే మరో నీట్ విద్యార్థి బలవన్మరణం చెందాడు. జవహర్ సర్కిల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గోపాల్ లాల్ తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్ లోని ధోల్పూర్ కు చెందిన విద్యార్థి ఆదివారం ఉదయం తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు.
సోదరుడు మార్కెట్ కు వెళ్లగానే..
నీట్ ప్రిపరేషన్ కోసం వచ్చిన ఆ విద్యార్థి తన సోదరుడితో పాటు హాస్టల్ లో ఉంటున్నాడు. సోదరుడు మార్కెట్ కు వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మార్కెట్ నుంచి తిరిగివచ్చిన సోదరుడు ఎంతసేపు తలుపు కోట్టినా.. తెరవకపోవడంతో హాస్టల్ యాజమాన్యానికి చెప్పాడు. వారు వచ్చి తలుపులు బద్ధలు కొట్టి చూడగా, వారికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కనిపించాడు. హాస్టల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది.
సారీ నాన్నా..
రాజస్థాన్ లోని ధోల్పూర్ కు చెందిన ఈ విద్యార్థి కోటాలో గత సంవత్సరం కాలంగా నీట్ (NEET) కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ మే నెలలో నీట్ మూడో ప్రయత్నానికి సిద్ధమవుతున్నాడు. అతని గదిలో ఓ నోట్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘‘సారీ నాన్నా. నేను ఈ సంవత్సరం కూడా సాధించలేకపోయాను’’ అని ఆ విద్యార్థి ఆ లేఖలో రాశాడు.
కేసు నమోదు..
ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. ఘటనా స్థలంలో ఎఫ్ఎస్ఎల్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఇటీవలి కాలంలో అతని ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. జిల్లా యంత్రాంగం మార్గదర్శకాలకు అనుగుణంగా హాస్టల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఎందుకు ఏర్పాటు చేయలేదనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు.
మీకు మద్దతు అవసరమైతే, మీకు తెలిసిన వారికి సహాయం అవసరమైతే.. మీ సమీప మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.