B.Ed Colleges : బీఈడీ కాలేజీలకు ఎన్‌సీటీఈ ఊరట.. ఆ తేదీలోపు నివేదిక పంపవచ్చు
B.Ed Colleges Report : దేశంలోని బీఈడీ కాలేజీలకు ఎన్‌సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) ఊరటనిచ్చింది. ఈ కాలేజీలు నివేదిక పంపాల్సిన తేదీని పొడిగించింది. 2021-22, 2022-23 విద్యాసంవత్సరాల్లో అడ్మిషన్లు, ఉపాధ్యాయుల వివరాలను నివేదికలో పొందుపర్చాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా బీఈడీ కాలేజీలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్ సీటీఈ) భారీ ఊరటనిచ్చింది. ఈ కాలేజీలు తమ పనితీరు మదింపు నివేదిక(పీఏఆర్)ను డిసెంబర్ 10లోగా సమర్పించాల్సి ఉంటుంది. గతంలో ఈ తేదీని నవంబర్ 10గా నిర్ణయించారు. 21-22, 22-23 తరగతులకు సంబంధించి కాలేజీల నుంచి ఎన్‌సీటీఈ నివేదికలు కోరింది.
పనితీరు నివేదిక ప్రకారం 2021-22, 2022-23 రెండు సెషన్ల నివేదికలను ఆడిట్ చేయాలని బీఈడీ కాలేజీలను ఆదేశించింది. ఈ కాలేజీల్లో ఈ రెండు సెషన్లలో ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఎంత మంది అధ్యాపకులను నియమించారు? అనే పూర్తి సమాచారాన్ని కూడా కోరారు.
బీఈడీ కాలేజీలు తమకు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ సర్టిఫికేట్ పొందాలని ఎన్‌సీటీఈ చెప్పింది. ఈ సర్టిఫికేట్ తర్వాతే ఎన్‌సీటీఈ బీఎడ్ కాలేజీలను గుర్తిస్తుంది. బీఎడ్ కాలేజీలు తమ సమాచారమంతా ఆన్‌లైన్‌లో ఎన్‌సీటీఈకి పంపాలి.
బీఈడీ కాలేజీల కళాశాల భవనం, తరగతి గది, లైబ్రరీ, బాలికల కామన్ రూమ్, టాయిలెట్ ఫొటోలను జియో ట్యాగ్‌తో ఎన్‌సీటీఈకి పంపాలి. ఇది కాకుండా కళాశాల భవనం ఎంత పాతది, ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని కూడా చెప్పాలి. కాలేజీలో ఎన్ని గదులు ఉన్నాయి, వీటన్నింటినీ ఆన్లైన్‌లో ఇవ్వాలి. దీంతోపాటు బీఎడ్ కళాశాల అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని, అందులో కళాశాల తాము ఇస్తున్న సమాచారం సరైనదేనని పేర్కొనాలి.
బీఈడీ కాలేజీలు ఏటా ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయో ఎన్‌సీటీఈకి తెలియజేయాలి. వీటితో పాటు కళాశాలలు ఈ రెండేళ్లలో కళాశాలలో చేసిన అభివృద్ధి పనుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నింపి ఎన్‌సీటీఈకి పంపాలి. కళాశాల తన బ్యాలెన్స్ షీట్‌ను కూడా ఎన్‌సీటీఈకి పంపాల్సి ఉంటుంది. దీనితో పాటు ప్రతి ఉపాధ్యాయుడి పాన్ కార్డును కూడా ఎన్సీటీఈ కోరింది. కళాశాల వెబ్‌సైట్ పనిచేస్తోందా లేదా అనే దానిపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గతంలో కొన్ని బీఈడీ కళాశాలలకు అనుమతి ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి. కనీస మౌళిక వసతులు లేకపోవడం, అర్హులైన అధ్యాపకులు కొరతతో యూనివర్సిటీలు అనుమతి దక్కలేదు. కౌన్సెలింగ్ సమయంలో ఆ కాలేజీలకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు.