పిల్లల చదువుకు మదర్సాలు సరైన ప్రదేశం కాదు : సుప్రీంకోర్టుకు చెప్పిన ఎన్‌సీపీసీఆర్
Supreme Court : ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందులో ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పిల్లలు చదువుకునేందుకు మదర్సా సరైన ప్రదేశం కాదని పేర్కొంది.
మార్చి 22న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వాస్తవానికి యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ని హైకోర్టు రద్దు చేసింది. ఈ నిర్ణయంపై ఏప్రిల్ 5న సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఎన్‌సీపీసీఆర్ అఫిడవిట్
మదర్సాలలో పిల్లలకు అందించే విద్య సమగ్రంగా లేదని, విద్యా హక్కు చట్టం (RTE చట్టం) 2009 నిబంధనలకు విరుద్ధమని NCPCR పేర్కొంది. మదర్సాలలో పిల్లలకు అధికారిక, నాణ్యమైన విద్య అందడం లేదని కమిషన్ చెప్పింది. మదర్సాలు విద్యాహక్కు చట్టం కిందకు కూడా రాకపోవడంతో అక్కడి పిల్లలు ఆర్టీఈ చట్టం కింద ప్రయోజనాలు పొందలేకపోతున్నారని తెలిపింది.
ఆరోగ్యకరమైన వాతావరణం, అభివృద్ధికి మెరుగైన అవకాశాలను కూడా కోల్పోయారని కమిషన్ అఫిడవిట్‌లో పేర్కొంది. వీరికి మధ్యాహ్న భోజనం, యూనిఫాం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వంటి సౌకర్యాలు అందడం లేదని తెలిపింది. 'మదర్సాలలో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, వీరిని ఖురాన్, మత గ్రంథాల పరిజ్ఞానం ఆధారంగా నియమించారు. ఉపాధ్యాయులు కావడానికి అవసరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. ఇటువంటి సంస్థలు ముస్లిమేతరులకు కూడా ఇస్లామిక్ మతపరమైన విద్యను అందిస్తున్నాయి, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 (3)ను ఉల్లంఘించడమే.' అని అఫిడవిట్ పేర్కొంది.
మదర్సాలో విద్యనభ్యసించే పిల్లవాడు పాఠశాలలో బోధించే పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని కోల్పోతాడని కమిషన్ తన అఫిడవిట్‌లో చెప్పింది. మదర్సా బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న పుస్తకాల జాబితాను పరిశీలించిన తర్వాత ఇస్లాం ఆధిపత్యం గురించి పాఠాలు బోధిస్తున్నట్లు తేలిందని కమిషన్ తెలిపింది.
గతంలో సుప్రీం కోర్టు స్టే
మార్చి 22న అలహాబాద్ హైకోర్టు.. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ చట్టం సెక్యులరిజం సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో లౌకికవాదం ఒక భాగమని చెప్పింది. మదర్సాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రాథమిక విద్యా విధానంలో వెంటనే వసతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై ఏప్రిల్ 5న సుప్రీం కోర్టు స్టే విధించింది.
విదేశీ నిధులు
మరోవైపు విదేశీ నిధులతో వేల సంఖ్యలో మదర్సాలు నడుస్తున్నాయని, రాష్ట్రంలోని మదర్సాలన్నింటికీ విదేశీ నిధులపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. కొన్ని మదర్సాలలో అక్రమాలు జరిగాయని తన నివేదికలో సిట్ వెల్లడించింది. ఆరు నెలలుగా విచారణ చేపట్టిన సిట్ తన రెండు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదిక ఇవ్వనున్నారు. నేపాల్ సరిహద్దు జిల్లాల్లో వందల సంఖ్యలో మదర్సాలు తెరిచినట్లు సిట్ ఇప్పటివరకు జరిపిన విచారణలో వెల్లడైంది. చాలా మంది తమ ఆదాయ, వ్యయాల లెక్కలను సిట్‌కు ఇవ్వలేకపోయారు. విరాళాలతో మదర్సాను నిర్మించామని క్లెయిమ్ చేశారు, అయితే డబ్బు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించలేదు.