National Science Day 2024: ఎందుకు ఫిబ్రవరి 28వ తేదీననే నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం?
National Science Day: జాతీయ సైన్స్ డే ను ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన ఘనంగా జరుపుకుంటాం. భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన దృగ్విషయం రామన్ ఎఫెక్ట్ (Raman Effect) ను భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ కనుగొన్నది 1928 ఫిబ్రవరి 28. అందువల్ల ఆ తేదీన జ్ఞాపకార్థం జాతీయ సైన్స్ డే ను జరుపుకుంటాం.
National Science Day 2024: భూమిపై ప్రతి ఒక్కరి జీవితంలో సైన్స్ ముఖ్యమైనది. కొన్నిసార్లు మనకు తెలియనప్పుడు కూడా, మనం సైన్స్ మరియు దాని అనువర్తనాలను మన దైనందిన జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాము . సైన్స్, దాని అనువర్తనాలు మన జీవితాలను సరళీకరించిన మార్గాలను, అది మనకు విషయాలను ఎంత సులభతరం చేసిందో గుర్తించడం చాలా ముఖ్యం. మన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడానికి, మన జీవితాలను సరళతరం చేయడానికి అహర్నిశలు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు.
ఎప్పుడు? ఎందుకు?
ప్రతి సంవత్సరం, ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. చంద్రశేఖర వెంకట రామన్ భారత్ కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. ఆయన రామన్ ఎఫెక్ట్ (Raman Effect) ను కనుగొన్న రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ‘‘పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు.. అది చెల్లాచెదురుగా ఉంటుంది. ఇది తరంగదైర్ఘ్యం మరియు శక్తిలో మార్పులకు దారితీస్తుంది. దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు’’. 1928, ఫిబ్రవరి 28న సి.వి.రామన్ ఈ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు. భౌతిక శాస్త్ర రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1930లో ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా లభించింది. ఈ ఆవిష్కరణకు గుర్తుగా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు.
జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్
ఈ ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్ - ‘‘స్వదేశీ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్’’. భారత దేశ సమగ్ర అభివృద్ధిలో సైన్స్ ప్రాముఖ్యతను గుర్తించడం తో పాటు, దేశీయంగా వివిధ వర్గాల పౌరులకు తమ దైనందిన జీవితంలో ఉపయోగపడేలా సైన్స్ ను, సైంటిఫిక్ రీసెర్చ్ ను ప్రోత్సహించడానికి ఈ థీమ్ కు రూపకల్పన చేశారు. మానవ సంక్షేమంలో శాస్త్రవేత్తల కృషి, విజయాలను గుర్తించడం కూడా ఈ దినోత్సవం లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన విధానాన్ని అర్థం చేసుకోవడం, అలాగే, ఈ రంగంలో మరింత కృషి చేయాల్సిన అంశాలను అన్వేషించి ఆ దిశగా కృషి చేయడం.. తదితర మార్గాలు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఉన్న ఉత్తమ మార్గాలు.