National Herald PMLA case: నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ సోమవారం మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈ కేసులో ఈడీ సుదీర్ఘంగా విచారించింది. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను కూడా గతంలో ఒకసారి ప్రశ్నించింది. తాజాగా, మరోసారి ఆయనకు సమన్లు జారీ చేయడంతో శివకుమార్ మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని పలు క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ శివకుమార్ పై కేసు నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల లావాదేవీల్లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని దాదాపు వారం పాటు ప్రశ్నించింది. అనంతరం, సోనియా గాంధీని కూడా కొన్ని గంటల పాటు సునిశితంగా విచారించింది. ఆ తరువాత ప్రస్తుతం పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ లను కూడా ప్రశ్నించింది తాజాగా, కర్నాటక కాంగ్రెస్ చీఫ్, మాజీ రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ ను విచారించింది. ఈడీ కోరిన డాక్యుమెంట్లను ఇప్పటికే ఇచ్చానని శివకుమార్ తెలిపారు.