NASA Dart mission : 'కొత్త శకం ఆరంభం'- నాసా డార్ట్ మిషన్ సక్సెస్!
NASA Dart mission live : భూమిని ఏదైనా భారీ గ్రహశకలం ఢీకొంటే భారీ వినాశనం తప్పదు! దానిని ముందే పసిగట్టి.. అంతరిక్షంలోనే అడ్డుకొవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానం కనిపెట్టింది నాసా. ఇందుకోసం ప్రయోగించిన డార్ట్ మిషన్.. విజయవంతమైంది.

NASA DART mission : గ్రహశకలాల నుంచి భూమిని, మానవాళిని రక్షించేందుకు నాసా చేపట్టిన డార్ట్ మిషన్ విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా నాసా పంపించిన ఓ స్పేస్‌షిప్.. లక్ష్యాన్ని ఢీకొట్టి, దాని దారిని మళ్లించింది! దీంతో ప్రపంచంలో కొత్త శకం మొదలైందని నాసా ప్రకటించింది. డార్ట్ మిషన్‌కు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.
ఏంటి ఈ డార్ట్ మిషన్..?
చిన్న చిన్న గ్రహశకలాలు భూమివైపు దూసుకొస్తే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా.. భారీ ఆకారంలోని గ్రహశకలాలు భూమిపై పడితే విధ్వంసం తప్పదు! వాటిని అంతరిక్షంలోనే అడ్డుకునేందుకు ఏదైనా మార్గం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ డార్ట్ మిషన్. ఇది సక్సెస్ అవ్వడంతో.. ఎలాంటి గ్రహశకలాలనైనా.. దారి మళ్లించడం కుదురుతుందని, తద్వారా భూమికి ప్రమాదం తప్పుతుందని రుజువైంది.
NASA DART mission live : ఈ ప్రయోగం కోసం వెండింగ్ మెషిన్ సైజులో ఉన్న ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు శాస్త్రవేత్తలు. తమ ప్రయోగం కోసం భూమికి 7మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న జంట గ్రహశకలాలు డిమోర్ఫస్, డిడిమొస్లను ఎంచుకున్నారు. ఈ రెండు గ్రహశకలాలు ఒకదాని చుట్టు మరొకటి తిరుగుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ జంట గ్రహశకలాలతో మనకి ముప్పు లేదు. ప్రయోగం కోసం మాత్రమే వీటిని ఎంపిక చేసుకున్నారు. డిమోర్ఫస్.. ఫుట్‌బాల్ స్టేడియం సైజులో ఉంది.
ఇక డార్ట్ మిషన్‌లో భాగంగా 10 నెలల క్రితం లాంచ్ చేసిన స్పేస్‌క్రాఫ్ట్.. తాజాగా డిమోర్ఫస్ గ్రహశకలాన్ని.. గంటకు 14,500మైళ్ల(23,500కి.మీల) వేగంతో ఢీకొట్టింది. ఫలితంగా దాని కక్షలో మార్పులు చోటుచేసుకుంటాయని నాసా భావిస్తోంది. ప్రస్తుతం డిడిమోస్ చుట్టూ తిరిగేందుకు డిమోర్ఫస్కు 11 గంటల 55 నిమిషాల సమయం పడుతోంది. తాజా ప్రయోగంతో అది ఇంకో 10నిమిషాలు పెరిగుతుంది!
NASA DART mission success : గ్రహశకలాన్ని ఢీకొట్టి స్పేస్‌క్రాఫ్ట్ ముందు భాగానికి ఓ కెమెరా ఉంది. అందులో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిని నాసా విడుదల చేసింది. అయితే.. డార్ట్ మిషన్‌లో భాగంగా కొన్ని వారాల ముందే ఎల్ఐసీఐఏక్యూబ్ అనే ఉపగ్రహం.. వ్యవస్థ నుంచి విడిపోయింది. స్పేస్‌క్రాఫ్ట్ వెనకాలే ఇది ప్రయాణిస్తోంది. గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాతి పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న కెమెరా.. ఫొటోలు, వీడియోలు తీస్తుంది. మరికొన్న వారాలు లేదా నెలల్లో ఇవి నాసాకు చేరుతాయి.
ఈ విషయంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమి, ప్రజలు మరింత ప్రశాంతంగా పడుకోవచ్చని అంటున్నారు.
సంబంధిత కథనం