Delhi MCD Polls: ముగిసిన ఢిల్లీ మున్సిపల్ ‘దంగల్’.. పోలింగ్ శాతం తక్కువే!-municipal corporation of delhi mcd polling finished 50 percent voting recorded ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Municipal Corporation Of Delhi Mcd Polling Finished 50 Percent Voting Recorded

Delhi MCD Polls: ముగిసిన ఢిల్లీ మున్సిపల్ ‘దంగల్’.. పోలింగ్ శాతం తక్కువే!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 04, 2022 11:40 PM IST

Municipal Corporation of Delhi - MCD Elections 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరిగింది. పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.

Delhi MCD Polls: ముగిసిన ఢిల్లీ మున్సిపల్ ‘దంగల్’.. పోలింగ్ శాతం తక్కువే!
Delhi MCD Polls: ముగిసిన ఢిల్లీ మున్సిపల్ ‘దంగల్’.. పోలింగ్ శాతం తక్కువే! (Hindustan Times)

Municipal Corporation of Delhi - MCD Elections 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi) ఎన్నికలు ముగిశాయి. 250 మున్సిపల్ వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగింది. బీజేపీ, ఆమ్‍ఆద్మీ మధ్య పోరు రసవత్తరంగా ఉండగా.. గెలుపుపై రెండు పార్టీలు దీమా వ్యక్తం చేశాయి. మరోవైపు, దాదాపు అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

50శాతానికి దరిదాపుల్లోనే పోలింగ్

MCD Elections 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు సుమారు 50 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5.30 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి కూడా ఓటేసే అవకాశాన్ని అధికారులు ఇచ్చారు. దీంతో ఓటింగ్ శాతం కాస్త పెరిగే అవకాశం ఉంది. తుది లెక్కలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. అయినా, గతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. 2017 ఎంసీడీ ఎన్నికల్లో 53.55 పోలింగ్ శాతం నమోదైంది.

సజావుగానే..

MCD Elections 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ 13,638 కేంద్రాల్లో జరిగింది. ఎక్కడ కూడా ఈవీఎంల సమస్య తలెత్తలేదు. సుమారు 25వేల మంది పోలీసులు, 13వేల మంది హోమ్ గార్డులు, 100 కంపెనీల పారామిలటరీ దళాలు ఈ ఎన్నికల భద్రతా విధుల్లో పాల్గొన్నారు.

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ ఓటు మిస్

MCD Elections 2022: ఉత్తర ఢిల్లీతో పాటు మరికొన్ని చోట్ల ఓటరు లిస్టులో తమ పేర్లు లేవని కొందరు ఓటర్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు అనిల్ చౌదరీ పేరు కూడా ఓటర్ జాబితాలో కనిపించలేదు. దీంతో ఆయన కూడా ఓటు వేయలేకపోయారు. ఓటరు జాబితాలో పేర్ల మిస్సింగ్ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‍కు ఫిర్యాదు చేసినట్టు బీజేపీ పేర్కొంది.

ఫలితాలపై ఉత్కంఠ

MCD Elections 2022 Results Date: ఈనెల 7వ తేదీన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 15 సంవత్సరాలుగా ఢిల్లీ మున్సిపల్ పీఠం బీజేపీ చేతుల్లోనే ఉంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్‍ఆద్మీ పార్టీ ఈసారి ఎంసీడీని కైవసం చేసుకోవాలని ప్రచారం హోరుగా చేసింది. కార్పొరేషన్‍లో గెలిచి 2024 సాధారణ ఎన్నికలకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జోరుగా ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ కూడా అంతే బలంగా ఢిల్లీ మున్సిపాలిటీలో అధికారం నిలుపుకునేందుకు ప్రయత్నించింది. పురపాలక పీఠం చేజారిపోకుండా.. బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో బీజేపీ, ఆమ్‍ఆద్మీ మధ్య మాటల తూటాలు పేలాయి.

2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాలు గెలిచింది. ఆమ్‍ఆద్మీ 48, కాంగ్రెస్ 27 వార్డుల్లో విజయం సాధించాయి. మరి ఈసారి విజయం ఎవరిదన్న విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది.

IPL_Entry_Point