Air India urinating case : : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎయిర్ ఇండియా 'పీ గేట్' ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ నెలలో ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళపై మూత్ర విసర్జన చేసిన కారణంగా.. ముంబైవాసి శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు.. శుక్రవారం రాత్రి బెంగళూరులో పట్టుకున్నారు. సంబంధిత వర్గాల ప్రకారం.. నిందితుడిని పోలీసులు ఢిల్లీకి తీసుకెళ్లారు.
మహిళపై మూత్ర విసర్జన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత.. నిందితుడు శంకర్ మిశ్రా పరారీలో ఉన్నట్టు తెలిపిన పోలీసులు.. అతడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. కాగా.. అతడు బెంగళూరులో తలదాచుకుంటున్నట్టు శుక్రవారమే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులను అల్టర్ట్ చేశారు. ఓ బృందాన్ని ఈ వ్యవహారం కోసం నియమించారు.
Shankar Mishra Air India : శంకర్ మిశ్రా.. తన ఫోన్‌ను వాడటం ఆపేశాడు. అయితే.. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన స్నేహితులతో ఛాట్ చేయడం మొదలుపెట్టాడు. దీని ఆధారంగా.. అతడు ఉన్న లోకేషన్‌ను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
మహిళపై మూత్ర విసర్జన కేసులో నిందితుడుగా ఉన్న శంకర్ మిశ్రా తండ్రి.. ఈ వ్యవహారంపై స్పందించారు. తన కుమారుడు రెండు రోజులు నిద్రపోలేదన్నారు. ఈ పూర్తి విషయంలో బ్లాక్మెయిల్ కోణం కూడా ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు.
Shankar Mishra Air India incident : "నా కుమారుడు అలసిపోయాడు. రెండు రోజులు సరిగ్గా నిద్రపోలేదు. ఎయిర్‌లైన్స్ ఇచ్చిన డ్రింక్స్‌నే సేవించి, పడుకున్నాడు. నా కుమారుడు చాలా మంచివాడు. ఇలాంటి ఘటన చేసి ఉండడు. బాధితురాలు డబ్బులు అడిగింది. మేము కట్టేశాము. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మేము తీర్చలేని విధంగా ఏదైనా డిమాండ్ చేసి ఉండొచ్చు. అందుకు నా కుమారుడు ఒప్పుకోలేదేమో! ఆ కోపంతోనే ఆమె ఈగో దెబ్బతిని ఉంటుంది. ఇందులో బ్లాక్మెయిల్ కోణం కూడా ఉండొచ్చు," అని శంకర్ మిశ్రా తండ్రి శ్యామ్ మిశ్రా అన్నారు.
బాధితురాలికి.. శంకర్ మిశ్రా రూ. 15వేలు చెల్లించినట్టు తెలుస్తోంది. నెల రోజుల తర్వాత ఆ డబ్బును బాధితురాలి కుమార్తె తిరిగిచ్చేసినట్టు సమాచారం.
Shankar Mishra Air India Wells Fargo Linkedin : 2022 నవంబర్ 26న.. ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది ఈ ఘటన. మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా.. 72ఏళ్ల వృద్ధురాలి ముందు ప్యాంట్ జిప్పు విప్పు మూత్ర విసర్జనం చేశాడు. ఈ ఘటనను విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. వారు సరిగ్గా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి.
ఈ పూర్తి వ్యవహారంపై విమానాయన సంస్థతో పాటు రెగ్యులేటరీ కూడా దర్యాప్తు చేపట్టింది. మరోవైపు నిందితుడు శంకర్ మిశ్రా.. తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.
సంబంధిత కథనం