Crime News : రోడ్డుపై వ్యక్తి మృతదేహం.. అతడి ఇంటికి వెళ్లి చూస్తే ఊహించని ఘటన
Crime News In Telugu : ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్ ముందు చనిపోయి ఉన్నాడు. అయితే అతడి కుటుంబ సభ్యులకు చెప్పేందుకు ఇంటికి వెళ్లగా షాకింగ్ విషయం కనిపించింది.
అపార్ట్‌మెంట్ ముందు రోడ్డుపై ఓ వ్యక్తి శవమై కనిపించాడు. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ రిసీవ్ చేసుకోలేదు. మెడలో తాళంచెవి ఉంది. దానిని తీసుకుని ఇంటికి వెళ్లి చూసే సరికి హాలులో భార్య కూడా శవమై పడి ఉంది.
ముంబయిలోని జవహర్ నగర్‌లోని టోపీవాలా మాన్షన్ ముందు రోడ్డుపై 58 ఏళ్ల కిషోర్ పెడ్నేకర్ మృతదేహం కనిపించింది. జిమ్ ఎక్విప్‌మెంట్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న కిషోర్ భవనంపై నుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు అతని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా కిషోర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు.
కిషోర్ మరణం గురించి అతని భార్య రాజశ్రీకి తెలియజేయడానికి అధికారులు ప్రయత్నించారు. పదేపదే ఆమె ఫోన్‌కు కాల్స్ చేసినా సమాధానం ఇవ్వలేదు. కిషోర్ మెడలో ఉన్న తాళాలు తీసుకుని ఇంటికి వెళ్లారు. పోలీసులు అతడి ఫ్లాట్‌కు చేరుకుని చూడగా తాళం వేసి ఉంది.
ఈ తాళాలను ఉపయోగించి, పోలీసులు ఫ్లాట్‌ను తెరిచారు. అతడి భార్య మృతదేహాన్ని కనుగొన్నారు. కిషోర్ చనిపోయే ముందు భార్యను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతని ఫ్లాట్‌లో డిప్రెషన్, డయాబెటిస్‌కు సంబంధించిన అనేక మందులు దొరికాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడేమో అని అనుమానిస్తున్నారు.
తన మరణానికి ముందు అతను తన కొడుకు కోసం ఢిల్లీ నుండి ముంబైకి విమాన టిక్కెట్‌ను బుక్ చేశాడు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు పంపించాడు. దంపతుల కుమారుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.
టాపిక్