Mukhtar Ansari death: జైలులో బాహుబలి గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి; యూపీలో హై అలర్ట్; విషమిచ్చారంటున్న కొడుకు-mukhtar ansari don and politician who once ruled eastern up dies after heart attack in jail ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mukhtar Ansari, Don And Politician Who Once Ruled Eastern Up, Dies After Heart Attack In Jail

Mukhtar Ansari death: జైలులో బాహుబలి గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి; యూపీలో హై అలర్ట్; విషమిచ్చారంటున్న కొడుకు

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 09:52 AM IST

Mukhtar Ansari death: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో హై అలర్ట్ నెలకొంది. ప్రముఖ గ్యాంగ్ స్టర్, ఆతరువాత రాజకీయ నాయకుడిగా మారిన ముఖ్తార్ అన్సారీ జైలులో గుండెపోటుతో మృతి చెందాడు. అన్సారీ మృతితో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది.

ముఖ్తార్ అన్సారీ (ఫైల్ ఫొటో)
ముఖ్తార్ అన్సారీ (ఫైల్ ఫొటో)

Mukhtar Ansari death: ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రముఖ గ్యాంగ్ స్టర్ లలో ఒకరైన ముక్తార్ అన్సారీ గురువారం సాయంత్రం బాందా లో జైలుశిక్ష అనుభవిస్తూ గుండెపోటుతో మరణించారు. 1997 నుంచి 2022 వరకు మౌ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. 60 ఏళ్ల అన్సారీని మరణించినట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు బాందా జైలు నుంచి రెండోసారి రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. అంతకుముందు, కడుపునొప్పి రావడంతో మంగళవారం కూడా ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

గురువారం రాత్రి..

‘‘గురువారం రాత్రి 8.25 గంటల సమయంలో అన్సారీకి వాంతులు కావడంతో అపస్మారక స్థితిలో ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొచ్చారు. తొమ్మిది మంది వైద్యుల బృందం రోగికి అత్యవసర వైద్య సహాయం అందించింది, కానీ అతను గుండెపోటుతో మరణించాడు’’ అని ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ రాష్ట్ర డీజీపీ కూడా అన్సారీ మరణాన్ని ధృవీకరించారు. ముక్తార్ అన్సారీ మృతి చెందినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్

అన్సారీ మరణం (Mukhtar Ansari death) నేపథ్యంలో ఆయన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మౌ, ఘాజీపూర్, బందా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో స్థానిక పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బృందాలను మోహరించినట్లు డీజీపీ తెలిపారు. వారణాసి, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా పోలీసు మోహరింపును పెంచామని, సున్నితమైన జిల్లాల్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించామని పేరు చెప్పడానికి ఇష్టపడని యూపీ పోలీసు ప్రధాన కార్యాలయంలోని మరో అధికారి తెలిపారు.

విష ప్రయోగం చేశారు..

కాగా, గ్యాంగ్ స్టర్ అన్సారీ మరణంపై ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ స్పందించాడు. తన తండ్రికి జైలులో ఆహారం ద్వారా స్లో పాయిజన్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై తమ కుటుంబం కోర్టును ఆశ్రయిస్తుందని చెప్పారు. జైలులో అన్సారీకి వడ్డించే ఆహారం ద్వారా నెమ్మదిగా విషప్రయోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన తరఫు న్యాయవాదులు బారాబంకీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 డిసెంబర్ 4న అన్సారీ కుమారుడు ఉమర్ తన తండ్రికి జైలులో ప్రాణహాని ఉందని, తనను రాష్ట్రం వెలుపల బీజేపీ కాకుండా మరే పార్టీ పాలిత రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది.

భయంకరమైన గ్యాంగ్ స్టర్, ఆ తరువాత పొలిటీషియన్

అన్సారీ గత కొన్ని దశాబ్దాలుగా తూర్పు యూపీలోని అత్యంత భయంకరమైన గ్యాంగ్ స్టర్ లలో ఒకరిగా ఉన్నాడు. వివిధ క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలాడు. 2005 నుంచి పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లలోని వివిధ జైళ్లలో ఉన్నాడు. తన రాజకీయ జీవితంలో మౌ అసెంబ్లీ స్థానానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థిగా మొదటిసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఆ తరువాత 2002, 2007లో ఇండిపెండెంట్ గా, 2012లో తన సొంత పార్టీ క్వామీ ఏక్తా దళ్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అన్సారీ సోదరుడు అఫ్జల్ రెండుసార్లు ఘాజీపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

14 మర్డర్ కేసులు

అన్సారీ 14 హత్య కేసులతో సహా 63 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీటిలో 8 కేసుల్లో దోషిగా తేలాడు. 2022 సెప్టెంబర్ నుండి జైలుశిక్ష అనుభస్తున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య, 1991లో అవదేశ్ రాయ్ (ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ సోదరుడు) హత్యల్లో అన్సారీ పాత్ర ఉన్నట్లు తేలింది.

బాహుబలి గ్యాంగ్ స్టర్ లు

యూపీలో రాయీస్, అన్సారీలను బాహుబలి గ్యాంగ్ స్టర్ (BAHUBALI GANGSTER) లుగా పరిగణిస్తారు. శక్తిమంతమైన వ్యక్తి అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతారు. కాగా, అన్సారీ మృతి (Mukhtar Ansari death) కి సమాజ్ వాదీ పార్టీ సంతాపం తెలిపింది. ముక్తార్ అన్సారీ కుటుంబానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంతాపం తెలిపారు. గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ మృతికి దారితీసిన పరిణామాలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముక్తార్ అన్సారీ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సమాజ్ వాదీ పార్టీ నేత అమీక్ జమీ డిమాండ్ చేశారు. కాగా, ముఖ్తార్ అన్సారీ మృతిపై జ్యూడీషియల్ విచారణ జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

IPL_Entry_Point