అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అక్క! గుండెపోటుతో 23ఏళ్లకే మహిళ మృతి- పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ..
Woman dies of heart attack : పెళ్లి వేడుకల్లో సరదాగా డ్యాన్స్ చేస్తున్న ఓ మహిళ.. సడెన్‌గా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయంది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. కొన్నేళ్ల క్రితం ఈ మహిళ సోదరుడు కూడా గుండెపోటు కారణంగానే మరణించాడు!

మధ్యప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది! ఓ పెళ్లిలో అప్పటివరకు సరదగా డ్యాన్స్ చేస్తున్న 23ఏళ్ల మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది! గుండెపోటు కారణంగా కొన్ని క్షణాల్లోనే మరణించింది. కొన్నేళ్ల క్రితం ఆమె సోదరుడు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ విదిషలో ఈ ఘటన జరిగింది. ఇండోర్‌కి చెందిన పరినిత జైన్.. తన బంధువు పెళ్లికి వెళ్లింది. హల్దీ వేడుకల్లో పాల్గొన్న ఆమె 200 మంది అతిథుల సమక్షంలో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. అప్పటివరకు అంతా బాగానే ఉంది! కానీ ఆ వెంటనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
డ్యాన్స్ చేస్తున్న పరినిత జైన్ ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోయింది. అప్పటివరకు చప్పట్లు, కేరింతలతో నిండిపోయిన ఆ ప్రాంగణాన్ని మౌనం కప్పేసింది. కొందరు పరినిత దగ్గరికి పరిగెత్తారు.
వేడుకల్లో పాల్గొన్న కొందరు డాక్టరు వృత్తిలో ఉన్న వారు సైతం స్టేజ్ మీదకు వెళ్లారు. పరినితకు సీపీఆర్ చేశారు. కానీ ఆమె స్పందించలేదు. ఆమెను వెంటనే సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. కొన్ని పరీక్షలు చేసిన అనంతరం ఆమె మరణానికి కారణంగా గుండెపోటు అని తెలిపారు.
ఇది విన్న పరినిత కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. కొన్నేళ్ల క్రితం.. పరినిత సోదరుడు కూడా గుండెపోటుతోనే మరణించాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 12ఏళ్లు.
పరినిత ఒక ఎంబీఏ గ్యాడ్యుయేట్. ఇండోర్‌లోని సౌత్ తుకోజంగ్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి పరనిత జీవిస్తోంది.
తాజా ఘటనతో కుటుంబంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. అప్పటివరకు సరదగా, సంతోషంగా ఉన్న పరినిత కొన్ని క్షణాల వ్యవధిలోనే తమను విడిచిపెట్టి వెళ్లిపోయిందని కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.
కాగా ఆ మహిళ డ్యాన్స్ చేస్తూ, చేస్తూ కుప్పకూలిపోయిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చిన్న వయస్సులోనే గుండెపోటు..!
చిన్న వయస్సులోనే గుండెపోటు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళనకంగా మారింది. మరీ ముఖ్యంగా, వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి.
గతేడాది ఏప్రిల్‌లో యూపీకి చెందిన ఓ 18ఏళ్ల యువతి.. తన సోదరి ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించింది. అంతకు కొన్ని సెకన్ల ముందు ఆమెకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న ఒక వ్యక్తిని పట్టుకుంది. ఆ వెంటనే కింద పడిపోయింది.
మరో ఘటనలో దిల్లీకి చెందిన 28ఏళ్ల మహిళ.. యూపీ నైనిటాల్ జిల్లాలో జరిగిన తన పెళ్లి వేడుకల్లో, డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.
సంబంధిత కథనం