ప్రియుడితో ఉన్నప్పుడు భార్యను పట్టుకున్న భర్త.. బెల్టుతో కొట్టి- ఊరంతా..!
ఓ గిరిజన మహిళను తన గ్రామానికి చెందిన ప్రజలు చిత్రహింసలకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఆమెను బెల్టుతో కొట్టి, చెప్పులతో తయారు చేసిన దండను మెడలో వేశారు.
మధ్యప్రదేశ్లో మానవజాతి సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. ఓ 32ఏళ్ల గిరిజన మహిళను.. ప్రజలు చిత్రహింసలకు గురిచేశారు. బట్టలు చింపేసి, ఊరంతా ఊరేగించారు. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో వారిద్దరిని హింసించారు. దాడి చేసిన వారిలో ఆ మహిళ భర్త కూడా ఉన్నాడు.

దేవాస్ జిల్లా బోర్పదావ్ గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఓ గిరిజన మహిళ, తన భర్త- ముగ్గురు పిల్లలతో ఆ గ్రామంలో నివాసముంటోంది. కాగా.. అదే గ్రామంలోని ఓ 26ఏళ్ల వ్యక్తితో ఆ మహిళకు అఫైర్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
శనివారం రాత్రి నుంచి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ భర్త. కాగా.. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి.. తన అనుచరులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టాడు ఆ భర్త. ఈ క్రమంలోనే ఆ 26ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఆమెను చూశాడు.
కోపంతో ఊగిపోయిన ఆ భర్త.. ఆ ఇద్దరికి నరకం చూపించాడు. అతనికి గ్రామస్థులు కూడా తోడయ్యారు. అందరు కలిసి ఆ ఇద్దరిని చిత్రహింసలు పెట్టారు. ఆ మహిళ బట్టలు చింపేశారు. బెల్టుతో కొట్టారు. కాళ్లతో కొట్టారు. భర్త కూడా దాడి చేశాడు.
ఇంకొందరు.. చెప్పులతో కూడిన దండను ఆ మహిళ మెడలో వేశారు. అక్కడితో ఆగకుండా.. భర్తను ఆమె భుజాల మీద ఎక్కించి, ఆ మహిళను ఊరంతా ఊరేగించారు. ఈ దాడిని స్థానికులు తమ కెమెరాల్లో చిత్రీకరించారు. పక్కనే ఉన్న పిల్లలు కూడా వీడియోలు తీశారు. ఘటనను నవ్వుతూ వీక్షించారు.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న స్థానిక కానిస్టేబుల్.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. ఊరి జనం నుంచి ఆ మహిళను, ఆ 26ఏళ్ల వ్యక్తిని రక్షించారు. పోలీసు వాహనం ఎక్కించి గ్రామం బయటకు తీసుకెళ్లిపోయారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇప్పటివరకు 12మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఆ మహిళ భర్త కూడా ఉన్నాడు.
కాగా.. ఆ మహిళను, ఆమె భర్త చిత్రహింసలు పెట్టేవాడని.. ఆ బాధను చెప్పుకునేందుకే తన వద్దకు వచ్చిందని ఆ 26ఏళ్ల వ్యక్తి పోలీసులకు చెప్పాడు.
తాజా ఘటనపై మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం రేగింది. అధికార బీజేపీపై కాంగ్రెస్ మండిపడింది. 'పేదలకు, గిరిజనలకు అండగా ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. కానీ బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి,' అని విరుచుకుపడింది.
సంబంధిత కథనం
టాపిక్