Monsoon news: ఈ నెలాఖరుకు దాదాపు దేశవ్యాప్తంగా విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు
ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కై మెట్ భారతీయులకు శుభవారత్ తెలిపింది. నైరుతి రుతుపవనాల్లో కదలిక వేగవంతమైందని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కై మెట్ తెలిపింది. జూన్ నెలాఖరు నాటికి కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే, నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వెల్లడించింది.
రాజస్తాన్, గుజరాత్, హరియాణా లోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే, జూన్ నెల చివరి నాటికి నైరుతి రుతు పవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కై మెట్ తెలిపింది. ఖరీఫ్ ఫంటల సాగుకు అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు. నిజానికి జూన్ 1వ తేదీ నాటికి కేరళలోకి ఎంటరయ్యే నైరుతి రుతుపవనాలు.. జూన్ నెలాఖరు నాటికే మొత్తం రుతుపవన వర్షపాతంలో 16% నుంచి 17% వరకు నమోదు చేస్తాయి. అంటే, జూన్ నెలలోనే సుమారు 17% వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ సంవత్సరం బిపోర్జాయ్ తుపాను సహా పలు కారణాల వల్ల రుతు పవనాల వేగం మందగించింది.
29 జూన్ నాటికి ఢిల్లీకి..
పంజాబ్, హరియాణాలతో పోలిస్తే, ఖరీఫ్ లో వర్షాలపై ఆధారపడి జరిగే వ్యవసాయం ఇతర ప్రాంతాల్లో ఎక్కువ. కాగా, రుతుపవనాలు జూన్ 29 నాటికి ఢిల్లీ, హరియాణా, పంజాబ్, మహారాష్ట్ర, మధ్య గుజరాత్ సహా పలు మధ్య భారతదేశ ప్రాంతాలకు విస్తరిస్తాయని స్కై మెట్ ప్రెసిడెంట్ మహేశ్ పలావట్ తెలిపారు. రానున్న 10 నుంచి 15 రోజుల్లో.. ఇప్పటివరకు నమోదైన లోటు వర్షపాతాన్ని సరిచేసేలా.. మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు. బిపోర్జాయ్ తుపాను వల్ల రుతుపవనాలు సుమారు రెండు వారాలు ఆలస్యమయ్యాయన్నారు. రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లకు విస్తరించనున్నాయని మహేశ్ పలావట్ తెలిపారు.
33% లోటు వర్షపాతం
జూన్ 1 నుంచి ఇప్పటివరకు సుమారు 33% లోటు వర్షపాతం నమోదైందని మహేశ్ పలావట్ తెలిపారు. రుతుపవనాల ఆలస్యం కారణంగా వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర పంటల సాగు విస్తీర్ణం కూడా గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందన్నారు.
టాపిక్